Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

209

మన పూర్వులు వాలుకార్ణవము అనినట్లున్నది. కాని అది ఉత్తరదిక్కుననున్నది. అందుచేత అది యిచ్చట సూచింపబడలేదు. ప్రాగ్జ్యోతిషము పడమటిదని రామాయణమందున్నది అది అస్సాం ప్రాంతములోనిదని చరిత్రకారుల అభిప్రాయము. మేరుపర్వతము పామీరుపర్వతాలే అని నేననుకొనుచున్నాను. ఈరాను కుత్తరమున సుమేరు అనునది కలదు. అది హిందూకుష్ పర్వతాలలోనిది. అచ్చటనే మేరోస్ (Meros) అను పర్వత మున్నదని ఆరియన్ అను ప్రాచీన చారిత్రకుడు వ్రాసెను.[1] -పామీరుపర్వతమే మేరువని నేనీ కారణముచే అనుచున్నాను. పామీర్ అనునదే పాయెమేర్ అను శబ్దము. దానికి పార్సీభాషలో. మేరువుయొక్క పాదు అని అర్థము.దానితో తూర్పువరకు వ్యాపించిన పర్వతాన్ని మనము హిమాలయ మనుచున్నాము. అట్టి హిమాలయములోని ఒక దేశము కాశ్మీరము. కాశ్మీరపదముకూడా మేరుశబ్దమును పట్టించి యిచ్చుచున్నది. మేరువు సకాశములో ఉండు దేశము కావున, కాశమేర అయియుండును. క్రమముగా అది కాశ్మీరఅయి, తుదకు కాశ్మీర అయియుండును.

ఇక వాల్మీకి చూపించిన ఉత్తర దిక్కులోని దేశ పర్వతాలగూర్చి ఆలోచింతము. మొదటిది మ్లేచ్ఛదేశము. ఇదే చర్చలో 5 వ ప్రకరణ

ములో ఫనికియా దేశమువారు మోలచ్ అను దేవునికి నరబలులు ఇచ్చుచుండిరనియు అట్టి మోలచ్ దేవపూజకులు కావున, వారు మ్లేచ్ఛులుగా పరిగణింపబడి యుందురనియు నే ననుకొని వ్రాసినాను. మాక్సుమూలర్ పండితుడిట్లు అభిప్రాయ మిచ్చియున్నాడు: "హిందూస్థానమునకు పశ్చిమములోనున్న బెలూచీజాతియే[2] మ్లేచ్ఛజాతి.” మాక్సుముల్లరు అభిప్రాయముకూడ సరిగాదను కొందును పతంజలి కాలమువరకు ఆర్యులు

  1. రసాతల by నందలాల్ దేవ్. పుట. 12.
  2. Max Muller's Science of Language Vol. I P. 93. RV-14