Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

రామాయణ విశేషములు

చున్నాముకదా! అటులే మన ప్రాచీనులు విదేశములను గురించి తామువిన్న విషయములను పెంచి ఊహించి వ్రాసిరి. తర్వాత పురాణాలనుపెంచువారు ఆదికర్తలు వాడినపదములకు అర్థమున్నదని తలచి ఇక్షుక్షీరాది శబ్దముల నాధారముగాచేసికొని మరికొన్ని కథలు తమ బుద్ధికుశలత కొలది అల్లి మనకర్పించి పోయినారు. తుదకు మన పురాణాలు మన వారికే అబద్ధాల పంచాంగము వంటివైపోయినవి.

తూర్పు దిక్కుననుండు ద్వీపములలో కొన్నింటిని మనము గుర్తింపవచ్చును. వాల్మీకి తూర్పు దీవులలో మనుష్యులను తినువారున్నారని వ్రాసెను. నేటికిని మనకు తూర్పుననుండు పాసిఫిక్ (శాంతి) మహాసముద్రములోని ద్వీపములందు కొన్నిట నివసించు ఆదిమనివాసులు మనుష్యులను తినువారని (Cannibals) పాశ్చాత్యులిప్పటికి వర్ణించి తెలుపుచున్నారు. వాల్మీకిచూపించిన యవద్వీపము. ఇప్పటి జవద్వీపము (Java) సువర్ణరూప్యక ద్వీపమే సుమిత్రా (Sumatra) ద్వీపము. దానికి తూర్పులో ప్లక్షద్వీపము, శాల్మలీద్వీపము, ఇక్షుక్షీరసముద్రములు కలవనినాడు. ఇవి ఇప్పటికి కలవుకాని తూర్పులో లేవు. ఇవి మనకు పడమట నున్నవి.

కిష్కింధకు తూర్పున బ్రహ్మమాలదేశ మున్నదనినాడు. ఇప్పుడు ఒరిస్సాలో కాబోలు బారామహల్ అను జిల్లా కలదు. ఇది ఉర్దూపదముగా కనిపించుచున్నది. ప్రాచీన బ్రహ్మమాలయే యీ రూప మును పొందెనేమో అని ఒక ఊహను తెలుపుకొనుచున్నాను.

లంకకు చాలా దక్షిణములో భోగవతీనగర మున్నదని వ్రాసి నారు. అది యవద్వీపములో కలదు. పడమటిదిశలో ఎడారులున్న వని తెలిపినారు. బహుశా అవి రాజపుత్రస్థానపు ఎడారియగు తార్ ఎడారి సూచనగా ఉండును. మధ్య ఏషియాలో గోబీ అను ఎడారి కలదు. దానిని