Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

రామాయణ విశేషములు

న్నారు. వారే ప్రాచీన రాక్షసులు. ఈ లంక నర్మదానది పుట్టుతావున కలదు." దీనినిబట్టి ఈ క్రింది అంశములు తెలియవచ్చును: నర్మద అమరకంటక పర్వతాలలో పుట్టినది. ఆ పర్వతాల కుత్తరమున క్రౌంచము, దాని కుత్తరమున పంచవటియు కలవు. అటైతే రామాయణములో పంచవటి గోదావరికి సమీపమందున్నదని వ్రాసినది తెలిపియున్నానుగదా! ఆ విషయ మబద్దమగునా? కానేరదు. శ్రీ కీబేగారి నిర్ణయము తప్పగు చున్నది.

సీతాపహరణమైన తర్వాత రామలక్ష్మణులు సీత నన్వేషించుచు పంచవటిని వదలి దక్షిణమార్గముగా వెడలి క్రౌంచారణ్యమును దాటి పోయిరి. ఈ క్రౌంచారణ్యము దండకారణ్యమునకు దక్షిణభాగము. ఇచ్చటనే “జనస్థానము” అను దేశముండెను. ఈ జనస్థానములో రాక్షస సంచారముండెను పంచవటి కుత్తరమునుండి జనస్థాన మారంభమగునని తలచవచ్చును. అచ్చటినుండి మరికొన్ని అరణ్యములను దాటుచూ వెళ్ళినతర్వాత పంపాసరస్సు వచ్చెను. అచ్చటనే ఋశ్యమూక పర్వత ముండెను. అచ్చటినుండి ఒక దినప్రయాణములో మహేంద్రగిరి. ఇది రాముని వనవాస భూగోళము.

4. సుగ్రీవుడు సీత నన్వేషించుటకై తన వానరులకు నాలుగు దిక్కులలోని దేశములను గురించి వివరించి చెప్పెను. ఈ భాగమే ముఖ్య మైనట్టిది. అయోధ్యను ముఖ్యకేంద్ర స్థానముగా చేసికొని వాల్మీకి తన కప్పుడు తెలిసినంతవరకు ప్రపంచ భూగోళమునంతయు ఒక్క మారు మనకు సింహావలోకనముచేసి చూపించినాడు దానినిట్లు నిరూపించెను:

తూర్పుదిక్కు

గంగానది, సరయూ, కౌశికీ, యమునా, కాళిందీ, సరస్వతీ, శోణనదులు. శైలకానన శోభితమైన కాలక(వన)ము, బ్రహ్మమాల