Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

రామాయణ విశేషములు

నింద్యముగా భావింపబడుచుండెను. ఇదే రామాయణమందు భరతుడు కౌసల్యతో తాను రాముని అడవికి పంపుట కంగీకరించినచో మద్య పానము, పరస్త్రీ సంగమము, అక్షఖేలనము జూదము చేసిన పాపము పొందుదును గాక అని శపథము చేసెను. అయో. 75–41

ఎద్దులను రెండువిధములగు పనులకు ఉపయోగించుచుండిరి. వ్యవసాయము చేయు ఎద్దులను భద్రకము లనిరి. మూటలుమోయు ఎద్దు లను శాలివాహములనిరి. బియ్యము మూటలనే ప్రధానముగా ఎద్దులపై తీసుకొని పోవుచుండిరనియు ఆయోధ్యదేశవాసులకు బియ్యమే ముఖ్య భోజ్యధాన్యముగా నుండెననియు శాలివాహిపదచరిత్ర తెలుపుచున్నది. అయో. 32-20 ఈ కాలములో లంచాలు ఎట్లు స్థిరపడిపోయిన సంఘజాడ్యమైయున్నదో అదే విధముగా ఆ నాడును లంచాలను తిను వారుండిరి. మంత్రు లంతటివారు కూడా దీని రుచిమరిగినవారుగా కనబడుచున్నారు. కుంభకర్ణుడు రావణునితో లంచాలుతినే మంత్రులను పరిహరింపవలెనని చెప్పెను. యుద్ధ. 63-18 అయితే ఇది రాక్ష సాచారమేమో అని సందేహింపవచ్చును. కాని ఆర్యులలోను లంచముల తినువారుండిరి. రాముని భరతుడు అరణ్యములో దర్శించుకొన్నప్పుడు భరతునితో నత డిట్లనెను: “నీవు చక్కగా పరీక్షించి ఉత్తములైన మంత్రులను నియోగించినావు కదా?" అని ప్రశ్నించెను. అయో. 100-26

రామాయణకాలమందు ఆపత్సమయములందుగూడా లత్తుక, మద్యమాంసములు, లోహము, విషము అమ్మి జీవించుట నీచవృత్తులుగా పరిగణింపబడుచుండెను. (అయో. 75–38)

యామదుందుభులు జామునకొకమారు మ్రోగించుచుండిరి. యామ కాలములను తెలుపుటకు దుందుభులను (నగారాలను) రాచనగరులముందు మ్రోగించుచుండిరి.