Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

రామాయణ విశేషములు


ఆత్మకామా, సదాచండీ, క్రోధనా, ప్రాజ్ఞమానినీ.
                                                  (అయో. 70-10)


కైకేయితల్లి జాడకూడ క్రూరమైనట్టిదనిన్నీ, తనమాట చెల్లింపుకై తన మగనిచావును గూడ లెక్కపెట్టలేదనిన్నీ, దశరథుని మంత్రియగు సుమంత్రుడు కైకేయిని దూరెను (అయో. స.35). ఈ కారణాలచే కై కేయి ఈరాన్ దేశపు ఈరానీ సుందరాంగియై యుండెనని ఊహించు చున్నాను. అయితే అయోధ్యనుండి ఈరాన్ ప్రాంతానికి పోవుటకు ఏడుదినాలు మాత్రమే పట్టుచుండెనా అను సందేహ మొక్కటి బాధించు చున్నది.[1]


బహుభార్యాత్వము

దశరథునికి నూర్లకొలది భార్యలుండిరను విషయమును గురించి వ్రాయుచు మధ్యప్రసక్తిచే కైకేయిని గురించి వ్రాసినాము. దశరథుని బహుభార్యాత్వము సువ్యక్తమే కాని రామాది సోదరులకును పెక్కు భార్యలుండిరా లేదా అని విచారింతము. పారంపర్యముగా వచ్చు హిందువుల భావనలో శ్రీరాముడును అతని సోదరులును ఏకపత్నీ వ్రతులై యుండిరి. అయితే రామాయణములో మూడుతావుల రామ భరతులకు బహుభార్య లుండినట్లు అనుమానము కలుగుచున్నది. వ్యాఖ్యాత లది కాదన్నారు. మంధర కైకేయికిట్లు బోధచేసెను: “రాముడు అభిషిక్తు డైనచో అతని యుత్తమస్త్రీలు ఆనందింతురు. నీ భరతునికి దుర్గతి

కలుగును నీ కోడండ్రందరును ఆనందరహిత లగుదురు"(అయో.8-12).
  1. రాధాకుముద ముఖర్జీగారు 'హిందూ సివిలిజేషన్' అను గ్రంథములో బాహ్లి కను మద్రదేశమువద్దను మద్రకు పశ్చిమములో కేకయదేశమును చూపి నారు. అనగా గాంధారదేశమునకు దక్షిణములో కేకయ దేశముండెను. ఇతర పరిశోధకులు బాహ్లికను బలఖ్‌గా నిర్ణయించినారు.