Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

రామాయణ విశేషములు

'నాయనా, ఆవులవలె స్త్రీలు యథేచ్ఛగా సంచరింతురు.' 'అయం ధర్మస్సనాతనః' అన్నాడు పెద్దమనిషి ఉద్దాలకుడు. ఇదంతయు మహా భారత కాలమందును తత్పూర్వమందును వర్తించెనని వర్ణించియుండగా రామాయణకాలమందు ఎచ్చటను ఇట్టి స్త్రీల యనావృతత్వము గోపద్ధతి కానరాకుండుటకు కారణమేమి? రామాయణమును ఆదర్శకావ్యముగా చేయుటవలన మన కిట్టివి లభింపనేరవో లేక నిజముగా రామాయణ కాలమందు అంతయు ఉత్తమముగానుండి తర్వాతకాలము చెడిపోయి యుండునో నిర్ణయింపజాలము. లభ్యమగుచున్న సూచనలను మాత్రమిం ముదాహరించుచున్నాను.

రామునికాలములో భోగముస్త్రీ లుండిరి. ఋశ్యశృంగుని మోస గించి తీసుకొనిపోయినది వారే (బా. 10-5). అనారీంపశ్యుడగు ఆ తిక్క వటుని మోసగించుట ఒక ఘనత కాదు. రాముని మొదటి యౌవరాజ్యాభి షేక సమయానికి వారకాంతలు సభను రంజింపజేయుటకు రానేవచ్చిరి. (అయో. 14) రాజులు అనేకభార్యలను వివాహమాడుచుండిరి. దశరథు నికి ముగ్గురు పట్టపు భార్య లుండుటయేకాక 350 మంది పైభార్యలుండిరి. (అయో. 34-13). వీరు సవర్ణస్త్రీలే యనుటకు వీలులేదు. పుత్రకామేష్టి చేసినకాలములో దశరథుడు తనకు లభించిన దివ్య పాయసమును తన 350 మంది భార్యలకు పంచి పెట్టక 'అనురూప' లైన తన ముగ్గురుభార్యలకే పంచిపెట్టెను 'భార్యాణా మనురూపానాం' (బా. 16-20) అనుదానికి సజాతీయలైన క్షత్రియభార్యలని వ్యాఖ్యాత లభిప్రాయపడినారు. దశరథుని కూతురుగు శాంతను ఋశ్యశృంగుడను బ్రాహ్మణున కిచ్చి పెండ్లి చేసిరి. అనగా అనులోమ వివాహములు జరుగుచుండెను.


కై కేయి

ఈమెను గూర్చి ప్రత్యేకము వ్రాయవలసియున్నది. దశరథుని పట్టపు భార్యలలో చేరినను ఈ కైకేయి సజాతీయ క్షత్రియ స్త్రీ యగునో