Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

రామాయణ విశేషములు

బలియిచ్చినపుడు చేసిన రీతిగా సలాకులపై గ్రుచ్చి సెగచూపి కాల్చి 'కబాబులను'గా చేసి ఆరగించుచుండిరి. మాంసమునకు తోడుగా మద్యమును సేవించుచుండిరి. ఆ మద్యము నానా విధములైనట్టిదిగా నుండెను.


ఇతర పాకములు

రామాయణ కాలమందు మాంసభోజనమునకే ప్రాధాన్యముండెనని తలపరాదు. ఆదికాలమునుండి త్రైవర్ణికులు మాంసభుక్కులు కారను చాలామందికికల విశ్వాసము తప్పని యెత్తిచూపనైనది. జనులు నానారుచ్య పదార్థముల నారగించుచుండిరి. "పాయసం కృసరం ఛాగం వృధానో౽శ్నాతు నిర్ఘృణః" అయో. 75-30 పాయసము, కృసరము, ఛాగమాంసము ఒంటిగా తినరాదన్నారు! కృసరమనిన నేమి? కొందరు 'కృశర' అనియు వ్రాసిరి. విల్సన్ అభిప్రాయములో కిచిడియే కృసరము ఇది శబ్దశాస్త్ర ప్రకారము సరిపోవు తద్భవమే. శబ్ద కల్ప ద్రుమములో కృశర పదమువద్ద “కిచిడీ ఇతిభాషాయాం" అని అర్థము వ్రాసినారు. 'కృసరస్తు తిలౌదనమ్' అమరము.

అరణ్యకాండలో 56 సర్గ తర్వాత సీత కింద్రుడు ప్రత్యక్షమై పాయసము నిచ్చుటను వర్ణించు 26 శ్లోకాలు ప్రక్షిప్తభాగాలని నిశ్చయ మైనది. అందు పాయస వృత్తాంతము కలదు భరద్వాజుని విందులో అయో. 91-73 “రసాలదధ్నము" చేరియుండెను. శుంఠి పిప్పల మిరియాలు లవంగాలు తక్కోలము శర్కర అల్లము జీలకర్ర పెరుగులో కలిపి చేసిన పచ్చడి రసాలదధ్న మని వ్యాఖ్యాత యొకడన్నాడు. కాని ఇది సరికాదేమో? రసాలమన తియ్యమామిడిపండు. మామిడిరసమును పెరుగు చక్కెర సుగంధ ద్రవ్యాలతో కలిపి చేయునట్టి "శిఖరిణి" అనునదే రసాలదధ్నమని తలతును.