80
రామాయణ విశేషములు
మరల రాముడు వనవాసము వెళ్ళిన తర్వాతనే అయోధ్యకు వచ్చెను. కావున భరతుడు బహుశః ఒక సంవత్సరముకన్న ఎక్కువ కాలము తన మేనమామగారి ఇంటిలో నుండెను.
ఈ విధముగా తమ వివాహకాలమందు సీతారాములు ఇతర సోదర దంపతులు యువతీయువకులుగా నుండినారని పైన తెలిపినప్పటికి ఈ క్రింద నుదాహరించుచున్న ఆధారములనుబట్టి వారికి బాల్యమందే పెండ్లి మయ్యెనని వాదింపవలసి యుండును. ఎట్లనగా-
(అయో. 20-45)
అరణ్యమునకు పోవునప్పుడు కౌసల్య రామునితో "రామా, నీవు
పుట్టి 17 ఏండ్లయ్యెనుకదా" అని యన్నది. సీతను రావణు డెత్తుకొని
పోవుటకై బ్రాహ్మణ వేషముతో వచ్చి నీ చరిత్ర యేమి అని సీతను
విచారింపగా ఆమె యిట్లన్నది:
ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధిని
తత స్త్రయోదశే వర్షే రాజా మంత్రయతః ప్రభుః
అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః
మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః
అష్టాదశహి వర్షాణి మమ జన్మని గణ్యతే.
(అరణ్య. 47-4, 5,10).
అనగా ——“నేను పెండ్లి అయినతర్వాత 12 ఏండ్లు నా భర్త
యింటిలో నుంటిని. అరణ్యానికి వచ్చే కాలములో రామునికి 25 ఏండ్లు, నాకు 18 ఏండ్లు" అని సీత అన్నది. దీనినిబట్టి సీతకు పెండ్లికాలములో 6 ఏండ్ల వయస్సనియు, రామునికి 13 ఏండ్ల వయస్సనియు తేలుతుంది