Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

75

వారు ఆమడలుకాక మరేమగుదురు ? మహాభారతమందలి నకుల సహదేవులవలె ఈ లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా ప్రసిద్దులు కాలేదు. ఉభయుల ప్రకృతులందును గుణములందును చాల భేదము కానవచ్చు చున్నది. లక్ష్మణుడు ఉగ్రుడు. ధర్మాగ్రహుడు. మహావీరుడు. శత్రుఘ్నుడు సాత్వికుడు. చెప్పినంత చేయువాడు. అప్రసిద్ధుడు.

రాముడు పునర్వసూ నక్షత్రమందే జన్మించెననుటకు రామాయ ణములోనే మరొక నిదర్శనము కలదు.


ఉత్తరాఫల్గునీహృద్య శ్వస్తు హస్తేన యోక్ష్యతే
అభిప్రాయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. (యుద్ధ. 4-6)


రాముడు లంకపై దండయాత్ర చేయుటకై కిష్కింధనుండి బయలుదేరుచు సుగ్రీవునితో నిట్లనుచున్నాడు. “సుగ్రీవా! ఈ దినము ఉత్తరఫల్గునీనక్షత్రము. నా జన్మ నక్షత్రము పునర్వసు. అందుచేత ఈ ఉత్తర నాకు సాధనతార యగును. ఇది విజయముకూర్చే మంచి నక్షత్రము. రేపు హస్తా నక్షత్రము. అది నాకు నైధనతార కావున ఈనాడే ప్రయాణము ప్రారంభింతము.”


రామ పట్టాభిషేకము


శ్రీరామ నవరాత్రులు అను పేరుతో చైత్రశుద్ధ ప్రతిపత్తునుండి శుద్ధ నవమి వరకు హిందువులు ఉత్సవాలు చేయుచుందురు. శ్రీరాముడు శు 9 నాడు పుట్టితే అంతకు పూర్వపు 8 దినాలలో ఉత్సవా లెందుకు చేయుదురు? కారణము తెలియరాదు.

శ్రీరామునికి మొదట దశరథుడు యౌవరాజ్యపట్టాభిషేకమును తలపెట్టినది చైత్రమందే.