70
రామాయణ విశేషములు
తీర్చి, భాషనుకూడా చాలా సవరించి తర్వాత క్రమక్రమముగా పెంచుచు ఇప్పటి రూపానికి తెచ్చినట్లు కనబడుచున్నది. జెకోబీగారు రామాయణాంతరంగికపరీక్షను బాగుగా చేసి బాలకాండ యుత్తరకాండయు మొదట లేకుండెననియు, 2 నుండి 6 కాండలవఱకే మొదట నుండెననియు తర్వాత బాలోత్తరకాండలను చేర్చి రామునికి విష్ణ్వవతారతత్త్వమును సిద్ధింపజేసిరనియు అభిప్రాయమిచ్చినారు. ఈ విధముగా రామాయణము పెరుగుతూ వచ్చినదనుటకు ఏమిన్ని సందేహములేదు.
శ్రీరాముని కాలమందే రామాయణము సంస్కృతభాషలోనే మార్గవిధానముతో తందానకథగా తంత్రీమర్ధలాదిపరికరాల సహాయముతో గానము చేయబడుచుండెను. అట్టికథాగానమును విశేషమైతే రెండు మూడు రాత్రులలో చేసియుందురు. సంస్కృతములో కథచెప్పిన పామరులు దాని నర్థముచేసికొని యుండవలయును. మరియు వారును సంస్కృతమునే మాట్లాడి యుండవలయును. పాణినికన్న పూర్వము జనులందరు సంస్కృతమునే మాట్లాడుచుండిరి. అతనికాలమువరకు ప్రాకృతభాషలు సంస్కృత జన్యములై వ్యాప్తిలోనికి వచ్చుచుండెను. సంస్కృతము పామరవ్యవహారముచే అపభ్రంశమై దుష్టము కాకుండా రక్షింపవలసియుండెను. పాణినికన్న పూర్వమే శాకల్యుడు, శాకటాయనుడు మున్నగువారు సంస్కృత వ్యాకరణములను వ్రాసిరి. ప్రాణిని క్రీ. పూ. 600 తర్వాతివాడు. రామాయణములోని భాషకూడా చాలా ప్రాచీనమైనదిగా ఉండెను. అనగా రామాయణమందంతటను ఇప్పుడుండు భాష పాణినికన్న పూర్వముదిగా కనబడును. పాణిని సూత్రాలకు భిన్నమైనభాష అందందు కనబడుచున్నది. దానిని తప్పనుటకు వీలులేక ఆర్షము అని పెద్దలు నిర్ణయించిరి. ఇట్టి ఆర్షమును చాలావరకు దిద్దియుందురు. అక్కడికిని వీలులేని పదాలను అట్లేయుంచి వాటిని ఆర్షప్రయోగముల క్రింద లెక్కకట్టివేసిరి. ఈ ఆర్షాలే రామాయణ ప్రాచీనతను పట్టిచ్చుచున్నవి.