పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 79

బగుబడలిక కైవడిం గనుపట్టుచుఁ గలికిచిలుకం దిలకించి [1]క్రోధమూర్ఛితయై కొంతతడ వూరకుండి వెండియుఁ దెలివి దెచ్చుకొని బెట్టునిట్టూర్పులు నిగుడించి గద్గదన్వరంబున ని ట్లనియె. 5

శా. ఏమేమీ వెర పింత లేకయె యిళాహేమాంగి యి ట్లాడెనే
యామాట ల్విని మంచి దం చనియెనే యాధూర్తగోపాలుఁడుఁన్
రామా యట్లనె కాని మంచిపని [2]రారాపేల యేమాయె నా
భామారత్నము గూడి తా సుఖము మై వర్ధిల్లినం జాలదే. 6

సీ. మఱచెనో నాచేతి మణితంబు లన్నియుఁ
బలుకనేర్చిననాఁటి పంజరింపు
తెలియదో నా చేతి దేశ్యంపుగుజరాతి
విత మెఱింగిననాఁటి వేఁడుకోళ్లు
ఎంచదో నాచేత నిల జంత్రగాత్రంబు
లభ్యసించిననాటియణకులెల్ల
వేఁడదో నాచేత వెడవిల్తుశాస్త్రంబు
లెఱుఁగఁబూనిననాఁటి తిరుగుమరుగు
తే. గణన సేయదొ మరుసాము గమనములకుఁ
దాను నాచేతఁబడిన బెత్తంపుపెట్లు
పరులు గని కేరి నవ్వ దబ్బర మురారి
లాలనకె పొంగి యిప్పు డిళాలతాంగి. 7

తే. నిన్నఁగుప్పయు నేఁడాళ్లు నెలఁత తాను
గోరి నామీఁదఁ జేసెనే కారుబారు
ముక్కుపచ్చలు మానక మునుపె బిరుదు
పిచ్చుక యెదిర్చి కాట్లాడ వచ్చినటుల. 8

తే. వెనుకఁ గొప్పును ముందఱఁ జనులు గేలి
సేయనాయెను నా చెంతఁ జేయు వింత

  1. క్రోధాతురచిత్తయై [మూ.]
  2. మే లాయెన్ మ ఱేమాయె [మూ.]