పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72 రాధికాసాంత్వనము

తే. అనుచుఁ జనుదేరఁ గని యిళావనితచెలియ
యంచు మది నెంచి చెలుల కేడించి దాని
గబ్బిచనుదోయి యెద నుంచి కౌఁగిలించి
పడఁతితోఁ దెల్ప వల దని పంజరించి. 134

సీ. తప్పక తనుఁ జూచి ఱెప్పవేయక వచ్చు
జలజాక్షిపై దృష్టిసైత మిడక
మోహాపదేశతమోముఁ జూపుచు వచ్చు
సకియమోమున ముద్దుసైత మిడక
బహుదూరమున నుండి పైఁట విచ్చుచు వచ్చు
చానగుబ్బల గోరుసైత మిడక
భ్రమఁ బోకముడి సగ్గి బారవైచుక వచ్చు
నాతిమేనున మేను సైత మిడక
తే. జారుశిఖ వీడ తెలిముత్తెసరము లాడ
నందియలు పల్కఁ బఱచె ఘర్మాంబు లొలుక
సదరు మదినాటి యిళనెంచి యదుకిరీటి
[1]పదక మెద మీఱ బంగారుపటము జాఱ. 135

మ. ఇటు లేతెంచినశౌరిరాకఁ గని యయ్యేణాక్షి మోహంబుచే
నటు చన్గుబ్బలు లుబ్బం గన్ను బెళుకన్ హారాళు లల్లాడ నా
మటుమాయ ల్గలశౌరిఁ జేరి పులకల్ మైఁ గ్రమ్మఁగాఁ గ్రుచ్చి కౌఁ
గిట శయ్యాగృహమందుఁ జేర్చి మదనక్రీడాభిలాషం దగన్. 136

క. అప్పుడు వారలవెంటనె
చొప్పెఱుఁగఁగనీక నందుఁ జొరఁబడి యొక హో
న్మెప్పులకీల్బొమ్మకడన్
దప్పక కనుచుంటి వారితటమట లెల్లన్. 137

  1. వెడలె నెదయందు మదనుఁడు విరియఁబాఱ