పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 రాధికాసాంత్వనము



జీవసజీవనంబు యదుసింహుఁడు శౌరి కిరీటిబావ శ్రీ
దేవియనుంగు సౌఖ్యనిరతి న్వసియింపఁగఁ గంటె కీరమా. 125

తే. ఎంత వేఁడిన బదు లాడ వేమి చిలుక
కాలగతు లెట్టు లున్నవో గడచినామె
కాఁగలది కాక మానదు గానఁ దెల్పు
చల్లకై వచ్చి ముంత దాచంగ నేల. 126

తే. అనిన విని చిల్క యుల్కి పేరల్క చిల్క
బల్కె ని ట్లని చిల్కలకొల్కితోడ
నన్నుదలమిన్న విను మొన్న నన్ను నీవు
వనజనాభుని దోడి తె మ్మనఁగఁ బోయి. 127

క. తెఱవా యే మని చెప్పుదు
హరి యున్నవనంబు చేరి యటు చూతుఁ గదా
గిరికొని యున్నా రచ్చటఁ
దరుణులు కోటానకోట్లు తన్మధ్యమునన్. 128

సీ. బారను గొల్వగా మీఱువక్షమువాఁడు
తలచుట్టి వచ్చు నేత్రములవాఁడు
చిక్కనిపాల్గారు చెక్కులు గలవాఁడు
మెఱుఁగుచామసచాయమేనివాఁడు
విడికెంపునణగింపు బింబాధరమ్మువాఁ
డున్నతాజానుబాహువులవాఁడు
చిగురాకులను గేరి నగుపాదములవాఁడు
డంబైనకంబుకంఠంబువాఁడు
తే. నెమలిరెక్కతురాఁబూనునెరులవాఁడు
మొలకనవ్వులఁదగుముద్దుమొగమువాఁడు
మదనకోటులఁ గొనగోట నదుమువాఁడు
చారుతరమూర్తి గోపాలచక్రవర్తి. 129