పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 65

సీ. మదహస్తిపై నెక్కి మావటీల్ గొలువంగ
విచ్చలవిడిఁ జొచ్చి వచ్చునటుల
సాంబ్రాణితేజపై సాహిణు ల్పొగడంగఁ
బట్టాను జేపట్టి వచ్చునటుల
వెంట దళంబులై విచ్చుకత్తులవారు
మెచ్చఁగా దులదుల వచ్చునటుల
గిలుకుపావలు మెట్టి చెలికాండ్రు వెంట రాఁ
బావురంబును బూని వచ్చునటుల
తే. బడఁతు లిరువంకఁ దెలనాకుమడుపు లొసఁగఁ
గొనుచు జిగిచూపులను నాదుమనసు గొనుచుఁ
బడకయిలు సేరఁగా శౌరి వచ్చునటులం
దోఁచుటే కాని మఱి యేమి దోఁచ లేదు. 108

చ. ఉరమున హారము ల్గదల నొ ట్లసియాడ రుమాల చెంగు వె
న్నొరసి నటింపఁగాఁ జెమట లూరఁగఁ గస్తురిబొట్టు జాఱఁగా
వరుసలు మీటఁగా గళరవం బొఱపారఁగ మందనుండి శ్రీ
హరి నను నేలె నేను నెదురానఁగ మాయగ నున్న దేమొకో. 109

చ. అరయఁగఁ బ్రాణనాయకుల నవ్వల నివ్వలఁ బాయురామ లా
విరిశరునంపతంపరల వ్రేఁగునఁ బొర్లఁగ న్యాయ మక్కటా
హరి యిదొ నాదులోవెలి నహర్నిశముం గనుపట్టుచుండెడిన్
విరహ మి దేలనో మిగులవేదనఁ బెట్టు దురాగతంబుగన్. 110

చ. వలచినవారు లేరొ యెడఁబాసినవారలు లేరొ వార లీ
యలమటఁ జెందిరే మిగుల నందియు నావలె జీవయుక్తలె
నిలిచిరె యేటిమాట లివి నేరక యాడితి భూమి నుండఁగాఁ
గలిగెను శౌరితోఁ జెలిమి గంధగజేంద్రసమానగామినీ. 111

ఉ. ఎంతవిలాస మెంతసొగ సెంతవదాన్యత యెంతరాజసం
బెంతయొయార మెంతకళ యెంతగభీరత [1]యెంతసోయగం

  1. యెంత యారజం [మూ.]