పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 రాధికాసాంత్వనము



నిట్లని పలుకఁ దొడంగెను
బొట్లంబుగఁ జుట్టు నున్న పొలఁతులతోడన్. 103

ఉ. శౌరిని బిల్వఁగాఁ జనినచక్కనికీర మదేల రాదొ యే
దారిని జన్నదో నడుమఁ !దారెనొ చేరెనొ లేదొ గోపికా
జారుని గాన్చెనో కనదొ చక్కఁగ నా వెత విన్నవించెనో
సారెకు లేక శౌరినుడిచక్కెగయుక్కెర మెక్కి చిక్కెనో. 104

సీ. పద్మాక్షుఁ డెవ్వతెపైఁ గన్ను వేసెనో
పలుమాఱు వలకన్ను పదరె నిదిగొ
శౌరి యెవ్వతెమోవి చవులకు మరగెనో
వదలక కెమ్మోవి యదరె నిదిగొ
వనజారి యచట నెవ్వతెచెట్టఁ బట్టెనో
విడువక భుజము కంపించె నిదిగొ
ఫణిశాయి యెవతెను బైకొని యేలెనో
మించి పెందొడ చంచలించె నిదిగొ
తే. చిత్తజునితండ్రి యెవతేచేఁ జిక్కుకొనెనొ
మించుసంచున మై తత్తరించె నిదిగొ
చిలుక యీవేళకును రాక నిలిచినపుడె
యేమి హేతువొ తెలియ లేదింతులార. 105

క. చెలువుఁడు వేఱొకచెలియను
దలఁపునఁ దలపోసినపుడె తనకుం దానే
తల నొచ్చుఁ గనక వినకయె
కలికిరొ యే మందు వలపు కానిది సుమ్మీ. 106

చ. కిలకిల నవ్వుచుం దివిరి కిన్నెర మీటుచుఁ బాట పాడుచున్
జిలుగురుమాలచెంగు వెనుజీరఁగ దుప్ప టొకింత జాఱఁగాఁ
గిళుకుహొరంగుపెండియము ఘల్లన నాయొడ లెల్ల ఝ ల్లనన్
దులదుల శౌరి వచ్చుగతి దోఁచియుఁ దోఁచక యున్నదేమొకో.