పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 61

సీ. మఱి సంజ గనిపించె విరహులపై వల
రాజు గ్రక్కినకోపరస మనంగఁ
దిమిరంబు [1]తిమిరించెఁ దెగి పాంథులను ముంచ
మరుఁడు నిర్మించినమాయ యనఁగఁ
దారక లరుదెంచె మారుండు పథికులం
గూల్ప నించినచిచ్చుగుం డ్లనంగ
విధుబింబ ముదయించె వెస వియోగులనొంప
స్మరవీరుఁ డెత్తినచక్ర మనఁగ
తే. బొండుమల్లియతండముల్ పూచినటులఁ
బండువెన్నెల బ్రహ్మాండభాండ మెల్ల
మెండుకొనె విప్రయోగులమీఁద శంబ
రారి వైచినవెలిగుడారం బనంగ. 87

చ. కలువలు మీఱె నీరరుహకాండము తారెఁ జకోరపంక్తి వె
న్నెలరుచి గోరె జక్కవలనీటులు దీఱె విటీవిటాళిపే
రలుకలు జాఱె సూనశరుఁ డమ్ములు నూఱె సుధాంశురాలలో
పల జల మూరె దంపతులబంధురతాపము లాఱె నంతటన్. 88

చ. వెడవిలుకాఁడు లోపలను వెల్పల గాలియుఁ బైని జంద్రుఁడున్
జడిగొని చుట్టుఁ గీరములు శారికలు న్బికహంసముల్ నెరా
యిడుములఁ బెట్టఁగాఁ గలికి యిట్టటు బెట్టుగఁ గొట్టుకాడుచున్
బడలి విరాళిచేఁ గుముదబంధుని గన్గొని సైఁచ కిట్లనున్. 89

ఉ. తోయధిరాజుకుం బొడమి తోయజవాసినితోడఁబుట్టి యా
తోయరుహాప్తుజం టగుచు తోయజనేత్రునకు న్మఱంది వై
త్రోయఁగ రానిచీఁకటులఁ ద్రోయుచుఁ జల్లనితెల్వి చెందియున్
నాయమె నీకుఁ జెంగలువ నాయఁడ నాయెడ నింత సేయఁగన్. 90

  1. మించెను దెగిసాధులను [మూ.]