పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60 రాధికాసాంత్వనము



గొనునునుదేంట్లు మారగురుఁ గోరి వహించుశుకంబు లొప్ప మే
లని పురుషోత్తమస్ఫురణఁ గైకొనె నీవనిఁ జూడు భామినీ. 82

క. ఇటు లాడుచెలులమాటలు
కుటిలాలక యాలకించి కొంతకుఁ గొంతన్
దిట మూని కేళివనమును
జటులగతిం జొచ్చి మెల్లఁ జని చని యచటన్. 83

సీ. పున్నాగములఁ జూచి పున్నాగము లటంచు
భ్రమ గొని లేమావిగుములఁ జేరు
లేమావిగుములను లేమావిగుము లంచుఁ
దారాడి స్యందనతతికిఁ బాఱు
స్యందనతతులను స్యందనతతు లని
వెత నొంది పరవీరతతులఁ గోరుఁ
బరవీరతతులను బరవీరతతు లంచు
బెదరి కెంజిగురాకుపొదలు దూఱుఁ
తే. బొదలు మదనుని విరియంపపొదు లటంచు
నవలగొజ్జంగినీటికాలువలఁ దారుఁ
జెలులపైఁ జీరు వేమారు కలఁకఁబాఱు
వెతలచే మీఱు వేసారు విధిని దూఱు. 84

క. ఈరీతి నెచట నిలువక
తారాడుచు నొకరసాలతలమూలమున్
జేరి విరిపాన్పుమీఁదను
నారీరత్నములు గొలువ నవలా చెలఁగెన్. 85

తే. కోకకుచ కాఁకఁజడఁ జూడ లేక లోక
బాంధవుం డస్తమించెను బశ్చిమాద్రిఁ
గువలయద్వేషి యయ్యును గొమ్మవంతఁ
గనఁగ లేఁడన నితరుల ననఁగ నేల. 86