పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56 రాధికాసాంత్వనము

దమి చెలంగును హరిచెంత నిమిష మున్న
మరువవచ్చునె యెవరెంత మరువుమనిన. 65

సీ. హరి పేరురముఁ జూచినంతఁ జన్గుబ్బలు
సిగ్గుమాలుచు రైక చిటుల నుబ్బు
బసిగాపురాయలపల్కు విన్నంతనే
వీనుల కమృతంబువిందు లగును
మీనాంకుతండ్రినెమ్మేను సోఁకినయంతఁ
బులకలు తను వెల్ల మొలకలెత్తుఁ
గమలాయతాక్షుని గదిసి పైకొన్నంతఁ
దమి నిండి తండోపతండ మగును
తే. నందనందనుఁ డబ్బెనా నవనిధాన
ములును దక్కినచందానఁ జెలఁగుఁ జిత్త
మామనోహరుఁ బాసి నేఁ డడల వ్రాసె
నౌర తలవ్రాఁత తలకొట్లమారిధాత. 66

క. చెలువుని గన్గొనుటకు నా
పలుకునఁ జని చిక్కె నేమొ పరిపరిగతులన్
బిలిచిన రా దిచ్చటికిం
జెలిమి గలుగునాదుమనసు చెలి యోచిలుకా. 67

క. వీడుదు బంధుల మగనిన్
వీడుదు ధనధాన్యగేహవిభవము లెల్లన్
వీడుదుఁ బ్రాణము లొడలన్
వీడంగాఁ జాల హరిని వే యన నేలా. 68

ఉ. ఎంతని విన్నవింతు హృదయేశుఁ డొనర్చినవింత లన్నియుం
జింత కెడంబు లాయె మును చేసినబాసలు దప్పు లాయె న
న్నింతులు నవ్వ నాయె వెత లెందు వెలి న్విడఁ గూడ దాయె నే
నెంతయుఁ దార నాయె నిఁక నేటికి మాటలు ముద్దుకీరమా. 69