పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 35



మ. అలరు ల్వాడ రుమాల వీడ నెదపై హారాళు లల్లాడఁ ద
ళ్కులచౌక ట్లసియాడఁ బావురపుఁబల్కుల్ పల్కుచున్ గుల్కుచున్
బలు జోకొట్టుచు మబ్బుదట్టుచును బైపై నిక్కుచున్ సొక్కుచున్
గళ లెల్ల న్గరఁగించి [1]యేలె సొగయం గంజాస్త్రుకయ్యంబునన్. 127

చ. గొనకొనుసిగ్గు మోహమును గూడఁగ నొక్కటి కొక్క టెక్కుడై
పెనఁగొను కేలు మోముపయిఁ బెట్టుక మెల్లన వ్రేళ్ళసందులన్
గనుఁగవ రెప్ప లార్పక యెఁగాదిగఁ గన్గొనె శౌరివక్త్రమున్
మనసిజకేళినైపుణిని మానక మానిని యప్పు డెంతయున్. 128

చ. ఉలుకును గొట్టుకాడు నగు నూర్పు లడంపుచు నూర కుండు లోఁ
గలఁగును బల్కఁబోవుఁ దట కాపడుఁ గన్గొనుఁ గన్మొగుడ్చు మైఁ
బులకలు దార్చు గ్రుక్కు లిడు బొమ్మెల మై మరచున్ సుఖోన్నతిం
దలకొని పారవశ్యమునఁ దామరసాక్షి య దేమి చెప్పుదున్. 129

సీ. మో మొకించుక యెత్తి మోవి యానఁగ నొత్తి
యది యిది చాలించి యట్టె యుండుఁ
గౌఁగిలింపఁగఁ జూచి కరపద్మములఁ జాచి
యందు కిందుకుఁ బోక యట్టె యుండుఁ
జనులఁ గ్రుమ్మఁగఁ గోరి సరస మెల్లనఁ జేరి
యవల కీవల కేగ కట్టె యుండుఁ
బౌరుషరతి కెచ్చి పైకొన గమకించి
యటు నిటులను జేయ కట్టె యుండు
తే. ముద్దు లిడ వచ్చి యందందుఁ బ్రొద్దు పుచ్చు
బలుకఁగా మీఱు నెలు గెత్తి • కలఁకఁబాఱు
విడె మొసఁగఁ బోవు సగమాకు మడిచి మానుఁ
దీరి తీరనిసిగ్గునఁ దెఱవ యపుడు. 130

వ. ఇట్ల నేకవిధంబుల నిళామాధవులు భంగరానంగసంగరక్రీడాపరవశు లై యున్నయెడ. 131

  1. యేలుకొనియెం [మూ.]