Jump to content

పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32 రాధికాసాంత్వనము

జారినకరకంకణంబులం గని చేయెత్తి కప్పుకొప్పు దిద్దుకొనుచొప్పునఁ గప్పుచుఁ గుచలికుచంబులం దగదగ మని తగులుకొనుచిగురువిలుగలతులువసెగలఁ దగిలి చిటిలి పెటిలి పడుతారహారంబులం బయలుపడనీక పయ్యెద చెఱంగున మఱుంగు సేయుచు నిజమందిరంబుఁ బ్రవేశించి యం దొక్క చొకాటంపుసులుపుపట్టుమేలుకట్టులం గనుపట్టుకట్టాణిముత్తియంపుజల్లులతో నల్లిబిల్లిగా నల్లుకొనుబొండుమల్లియలపూదండలం దగిలి రొదలు సేయు తుమ్మెదలగరులనిగనిగలకుం బదు లనఁగఁ దగిలి మగరాలసోరనగండ్లనుండి వెలికి నిగుడునగురుసాంబ్రాణిపొగల మగుడం ద్రోయుచుఁ దెరగంటిమచ్చకంటులనెరినెరుల వరలువిరులచేరులనెత్తావుల నత్తమిల్లి మత్తిల్లి వచ్చుకమ్మతెమ్మెరలనగ మిగులుమగరాలసౌధంబున నెంతయు వింతవింతపనిసంతనల మంతు కెక్కుజీవదంతపుఁజప్పరకోళ్ళమంచంబుపై రవిబింబంబుడంబు విడంబించుకెంబట్టుపరుపున రాజినశిఖారేఖల సెకమీఱుసూరెపుటంబుతలగడఁ జేరి యొక్కపల్లవపాణి పదపద్మంబులు పట్టుచుండఁ బవ్వళించి యాత్మగతంబున.

ఆ. సొమ్ము లియ్య వచ్చు సొ మ్మంద మియ వచ్చు
నియ్యరాని ప్రాణ మియ్య వచ్చుఁ
దనదువిభుని వేరుతరుణి చేతికి నిచ్చి
తాళ వశమె యెట్టి దానికైన. 116

సీ. నాతి యింతకు మున్నె నాసామి మధురాధ
రామృతమ్మును జూఱలాడ కున్నె
యతివ యింతకు మున్నె హరివిప్పుటురముపై
గుబ్బలకసి దీఱఁ గ్రుమ్మ కున్నె
రమణి యింతకు మున్నె రమణుకౌఁగిటఁ జేరి
పారావతధ్వనుల్ పలుక కున్నె
చాన యింతకు మున్నె శౌరి పైకొన వెను
దియ్యక యెదురొత్తు లియ్య కున్నె
తే. మున్నె యది జాణ సిగ్గుచే నున్నఁ గాని
విభుఁడు వగఁ జేసి తనువ్రీడ వీడఁ జేసి