ప్రథమాశ్వాసము 28
తే. గీ. తరుణు లప్పుడు సంపెంగతైల మంటి
మించుఁబోఁడిని దాన మాడించి రెలమిఁ
దమ్మిగుమ్మితిదొరచేతి తలిరుటాకు
చికిలిబాకును దేజుమాల్ చేసినటుల. 77
సీ. పరిమళంబులు ముట్టి కురు లార్చె నొకభామ
చక్కగా జడ వేసె నొక్కలేమ
కస్తూరితిలకంబు ఘటియించె నొకజంత
బుక్కాము మైఁజిల్కె నొక్కకాంత
కెంబట్టుపావడ గీలించె నొకబోటి
యొగి రైక ముడి వెట్టె నొక్కజోటి
హొంగోక మొలఁగట్టె నొకమదావళయాన
యొదవించె మణిభూష లొక్కచాన
తే. తరుణి యొక్కతె నిల్వుటద్దంబుఁ జూపె
[1]రమణి యొక్కతె మేన గందము నలందెఁ
[2]బడఁతి యొక్కతె యగురుధూ పంబు వైచెఁ
జేడియకు నిట్లు రాధ కైసేయువేళ. 78
తే. తెఱవ యీరీతి నిండుముస్తీబుతోడ
నుల్లసిల్లెను మల్లెపూఁజల్లు లలర
నవ్వగలచివ్వలకుఁ గాలు ద్రవ్వుకొనుచు
మరునిపడివాగెపై గోవ మట్ట మనఁగ. 79
క. అంతటఁ గాంత లిళాసతి
వింతఁగఁ గైసేసి తెచ్చి వెల గలమగరా
సంతనల మంతు కెక్కిన
దంతపుపనిచవికెలోన దయ దనివారన్. 80