పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 21

ఆ. చికిలి సానఁ దీర్చు జీవరత్నమురీతిఁ
బరువమైన కుసుమవల్లిపగిది
మెఱుఁగు చేసినట్టి మేల్మిబొమ్మవితాన
రమణి దనరె జవ్వనమున నపుడు. 68

తే. శుభదినంబున సప్తమశుద్ధి గలిగి
చెలఁగువేళను గురుమాపుచీరతోడ
సరసరుచిరాన్నభోజనోత్తరమునందు
నీ డెఱుంగనిచేడియ యీడు మీఱె. 69

సీ. మనయశోదను జీరి మనయిళ పుష్పించె
నని చెప్పి బహుమతు లందరమ్మ
తెలియఁగా రోహిణీదేవిని రప్పించి
యాచిన్నెలో కావొ యరయరమ్మ
చుట్టపక్కాలకు శుభపత్రికలు వ్రాసి
పంప మామకు శ్రుతపఱచరమ్మ
దినశుద్ధి లగ్నంబు గని సాంగ్యములు దెల్ప
వేగ గర్గుని బిలిపించరమ్మ
తే. కలికిలతకూన పుష్పిణిగాఁ జెలంగె
నెవరు గన్నారు మాధవు నెనసె నేమొ
మందు లీవలె సాంబ్రాణి మధురమధువు
మంచిఖర్జూరములను దెప్పించరమ్మ. 70

క. అనువనితల గుసగుసలను
విని కనులను జలము లొలుకఁ బెనుసిగ్గు[1]పడన్
వనజాక్షిని గని రాధిక
చినిచిన్నెలకన్నె నెన్ని చేసెద రనుచున్. 71

సీ. అంటు గల్గినవారి నంటుకో నియమించి
పడఁతిని మగరాలపలక నుంచి

  1. గొనన్ [మూ.]