పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



తే. గీ. యనుచు బుధకోటి పొగడఁగాఁ దనరు [1]కోటి
యన్నువులమిన్న నందుని కన్నఁజిన్న
వారిధరవేణి రాధికాకీరవాణి
ప్రబలును జెలంగ హరిప్రాణపద మనంగ. 51

వ. అదియునుం గాక. 52

సీ. నెరికొప్పు మినుకొప్పు నిడుదపెన్నెరులతో
నునుజూపు లీనెడు కనులతోడఁ
గళలు దేఱుచు మీఱు కలికినెమ్మోముతో
విడికెంపు గనుపింపు పెదవితోడ
గెఱగట్టుకొని పుట్టు నెఱపూపచనులతో
గడుసన్నగిలుచున్న కౌనుతోడ
జిగి హెచ్చుచును వచ్చు చికిలిలేఁదొడలతో
జడతలొల్కుచుఁ గుల్కునడలతోడ
తే. గీ. రమణఁ బాల్గాఱు చెక్కుటద్దములతోడ
మేల్మి గనుపట్టు చిన్నారి మేనితోడఁ
దేజరిల్లును బే రిళాదేవి యనఁగ
రాజగోపాలుపట్టంపురాణి యగుచు. 53

ఆ. వె. ఆమెఁ గూడి దానవాళికిఁ గాలుఁడు
గోపసతులకెల్లఁ గుసుమశరుఁడు
జలజజాదిసురల కలపరబ్రహ్మంబు
తల్లిదండ్రులకును దనయుఁ డగుచు. 54

సీ. మోహించి యొకక్రేవ ముగ్గభామామణు
ల్తళుకుఁజూపులఁ గల్వదండ లొసఁగ
మన్నించి యొకచోట మధ్యాణుమధ్యలు
దెలినవ్వులను సుమాంజలులు [2]నెరప

  1. బోటులందుఁ దలమిన్న [మూ.]
  2. ముడువ [మూ.]