పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. ఏవంకఁ జూచిన నేణీవిలోచనా
రతికూజితార్భటీరావచయము
లేచాయఁ జూచిన నిందుబింబాననా'
వల్లకీవాదనవైభవంబు
లేఠావు చూచిన నిభరాజగామినీ
[1]సంగీతసాహితీసంభ్రమంబు
లేదిక్కు చూచిన నింద్రనీలాలకా
భరతశాస్త్రోక్తభావాభినయము
తే. గీ. లెందుఁ జూచిన గోపికాబృందగీత
మదనగోపాలసత్కథామహిమ లలర
నంగభవమల్లరంగ మై రంగుమీఱు
బహుతరస్త్రీలతోడ వ్రేపల్లెవాడ. 47

తే. గీ. అందుఁ జెన్నొందునందునిమందిరమున
వాస మై యుండుఁ గౌస్తుభోద్భాసితుండు
దానవవిదారి [2]యిష్టహృత్తాపహారి
భవ్యగుణపాళి మదనగోపాలమౌళి. 48

సీ. కువలయామోదంబు గొనవచ్చుసత్కీరి
నిశికాంతుఁ డగుట సందియము గలదె
కమలాభిరుచిహేతుకం బైనతేజంబు
దిననాథుఁ డగుట సందియము గలదె
దానవారిసమృద్ది దనరించునస్త్రంబు
దేవేంద్రుఁ డగుట సందియము గలదె
హంసాహితశ్రీల నలరారునెమ్మేను
నీలాబ్ద మగుట సందియము గలదె
తే. గీ. యినకరదళోపలాలన గనుపదంబు
లంబుజాతంబు లన సందియంబు గలదె

  1. సంగీతసాహిత్య [మూ.]
  2. దుష్టచిత్తాపహారి [మూ.]