ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8
మంచిప్రతిగా ముద్రింపవలయు ననుతలంపుతో వ్రాతప్రతిని ముద్రితపుస్తకమును సరిచూచి నామనసున కింపైనపాఠము నుంచి యొకప్రతి పనిఁ బూని వ్రాసితిని. ఇటీవల బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు ప్రాచీనప్రబంధములను మంచిస్థితిలోనికిఁ దెచ్చుచుండుటచే దీనినిగూడ వారే యచ్చొత్తించినచోఁ జాల బాగుగ నుండు నని యెంచి యీప్రతి యనేక వందనములతో వారియొద్దకుఁ బంపించితిని. ఇది వ్రాసినదియు సవరించినదియు స్త్రీయే యగుటచేతను గలిగినతప్పుల నొప్పులుగా గమనింతు రని స్త్రీల యందు గారవము గలవారిని బ్రార్థించుచున్నాను.
సౌమ్యసంవత్సరపు మహాశివరాత్రి. చెన్నపట్టణము 9.3.1910 |
ఇట్లు, సహృదయవిధేయురాలు |