పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 141

గబ్బిగుబ్బలపెంపు కలుము లెం తైనను
బిఱుఁదులనెరిమిన పెంపు మేలు
కనుబొమపైఁదగుఘనఫాల మెం తైన
నునుబొత్తికడుపుకందువలు మేలు
పలికెడుపెదవులఁ గలయెఱు పెం తైనఁ
బలుకని యలచోటిపొలుపు మేలు
తే. పైకి నెగిరినచీరయె యాకసంబు
మిగుల నాలోనిద్రవమె పో గగనగంగ
యౌర నూఁగారురేకయే కారుమొగులు
వనిత యాలింగనసుఖంబె వర్షఫలము. 95

చ. చులకనఁ జేసి నన్ వలపు చూఱలు వుచ్చిన వీడ నాడినం
బలికినఁ బల్కకుండినను బాలను ముంచిన నీట ముంచినం
జెలి మిఁకఁ జాలు పొమ్మనినఁ జేరఁగఁ బిల్చినఁ బిల్వకుండినన్
భళిభళి యౌను గా దనినఁ బాయుదునా నిను రాధికామణీ. 96

వ. అనిన విని. 97

కం వనజాక్ష యింత చేయఁగ
మన సొగ్గెనె యంతె చాలు మానము కన్నన్
విను ప్రాణ మేమి ఘన మగు
నని యీసును వలపు కోప మదనము గాఁగన్. 98

ఉ. అందపుపైఁటకొంగు వదనాబ్జముపై నిడి శౌరి చూడ నా
యిందునిభాస్య యేడ్చె నెలుఁగెత్తి కలస్వన మొప్ప వెక్కుచున్
సందగుగబ్బిగుబ్బలను జాఱెడుతన్నయనాంబుపూరముల్
మందరమేరుశైలముల మాటికిఁ బాఱుఝరంబులో యనన్. 99

చ. చెలి యటు లేడ్వఁ జూచి హరి చేరి పదంబులు పట్టి కూర్మిచే
మెలఁతరొ యేడ్వనేల నిను మించినవాఁడనె గోప మంతఁగాఁ
గలిగిన నన్నుఁ జేయఁ గలకార్యము లన్నియుఁ జేసికొమ్ము నే
తలఁపఁగ నీదుసొ మ్మనుచుఁ దా బలిమిం గొని కౌఁగిలించినన్. 100