చతుర్థాశ్వాసము 129
రొదల నడంచుకొంచు మదిలో భంగుసంభ్రమముల్ చెలంగఁగా
మదనునిఁ గన్నమన్నెదొర మౌనముతోడుతఁ బోవ ముందటన్. 44
సీ. నునుపచ్చరాకట్టుపనిగీముల గడంగి
రవ మేది యుండు పారావతముల
మగరాలఁదగుగూళ్ల మరగి తలల్ వంచి
పలుకు లాడక కూర్కు చిలుకగముల
జిలుఁగుకెంపులయంత్రములమేఁత లంటక
చాల సోలుచుఁ దూలుశారికలను
బటికంపుజగతుల నటనముల్ చాలించి
సారె వేసారు మయూరములను
తే. బాలశశిరేఖకు ముడుంగుపద్మినులను
వల్లకీవేణుమురజాదివాదనముల
జోలిమాలినచెలియలఁ జూచి చూచి
తెఱవకోపము వానిచేఁ దెలిసికొనుచు. 45
ఉ. ఏ మని పల్కునో చెలియ యేవహి నుండునొ యెట్టు లెంచునో
యే మని పల్కఁగా వలెనొ యే నపు డే మన నేమి వచ్చునో
కాముఁడు తోడు గావలయుఁ గల్కికి మాకును జర్చ లేక మున్
బ్రేమలఁ గూడఁ గల్గునొ యరే యని నెమ్మదిఁ జింత సేయుచున్. 46
ఉ. గోపవతంసుఁ డీపగిదిఁ గొంకి తొలంగుచుఁ బోయి రాధికా
గోపిగృహంబుఁ జేరునెడ గుండియ భ గ్గన మెల్ల మెల్లఁగా
లోపలి కేగి యచ్చట సరోజరిపూపలవేదిశయ్యపై
గోపము గొన్న యాకుసుమకోమలినిం గని మేను ఝల్లనన్. 47
చ. పదములదండ నుండి భయభక్తు లెసంగఁగఁ జుట్టి కెందొగల్
పొదలెడువీవనన్ జలువ పుట్టఁగ వీవఁగ దానఁ జానకున్
మదిని దురాపకోపశిఖి మట్టుక మీఱ మురారి ధీరుఁడై
మృదుమధురోక్తులన్ బలికె మీనవిలోచన నెన్ని తిన్నఁగన్. 48