పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 123

సీ. విడు విడు మని డాసి కడ కన్ను లెఱఁజేసి
వెలికమ్మతమ్ముల విసరె నొకతె
తను వొకించుక పొంచి తమి యుప్పతిల వంచి
సంపంగిననలచే జవిరె నొకతె
ఝ మ్మటంచు నదల్చి జాడ కడ్డము నిల్చి
విరజాజివిరు లెత్తి విసరె నొకతె
గగ్గోలుగా నార్చి కడు దురంబు దనర్చి
జిగినల్లగలువలఁ జిదిమె నొకతె
తే. చలువపన్నీరు మైనిండఁ జల్లె నొకతె
యొప్పుపుప్పొడి తెప్పున గుప్పె నొకతె
యురగశాయిని రానీక యొడ్డు చూపి
యానుఁ డని రాధపై దళం బనుపఁ జెలఁగి. 15

చ. చెలిచెలు లిట్లు చేరి తనుఁజెందినయుల్లము లుల్లసిల్లఁగా
బలుచనుగుబ్బపోటులను వాల్ జడవేటుల గోటిమీటులన్
గలిబిలి చేసి రవ్వ లిడఁగాఁ గని శ్రీహరి యీటెపోటులం
గలగనిగంధసింధుర మనంగఁ దొలంగక నిల్చి యిట్లనున్. 16

తే. సుదతి యిసుమంత కడగంటఁ జూచినంత
యింతరంతులు చేతురా యింతులార
అలుక దీరఁగ దొరసాని కమరఁ బలికి
చెలిమి యొనరించి సుకృతంబుఁ జెందుఁ డనిన. 17

సీ. చెలిమి యొనర్పఁగా వలదెయీని న్నంచు
వెస నుల్కి కెమ్మోవి విఱిచె నొకతె
యీబుద్ధి యానాఁడె యెందుఁబోయె నటంచు
విడనాడి చేతులు విచ్చె నొకతె
యెవ్వారి నెంచక యిఁక మెలంగుదు వంచుఁ
గలికిలేనడు ముల్క గులికె నొకతె