పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 108

జిగిగుబ్బలను గ్రుమ్మి బిగికౌఁగిటను గ్రమ్మి
మనసారఁ దను పమ్ము మంచితనము
ఒడికట్టు సడలించి తొడ తొడఁ గదియించి
బెట్టుగాఁ దమి నించు దిట్టతనము
జిలుఁగుతిట్టులు దిట్టి యలిగి చెక్కిలి గొట్టి
వలపుముద్దులు పెట్టు సొలపుఁదనము
తే. మ్రొక్కి మ్రొక్కించుకొనునట్టి చక్కఁదనము
పొగడి పొగడించుకొనునట్టి ప్రోడతనము
దక్కి దక్కించుకొనునట్టి దంటతనము
దానికే కాక కలదె యేచాన కైన. 112

ఉ. ఎందఱిఁజూడ నీవఱకు నెందఱితోడుత ముచ్చటాడ నే
నెందఱి కేళిఁ గూడి సుఖ మెంతయుఁ జెందను? దానియల్లచో
టందము పొందుచందమును నందునఁ జిందుసుఖద్రవంబు నే
చందనగంధియందుఁ గన సారెఁ దలంచిన దానికే తగున్. 113

చ. పొలయలు కాఱి నేఁ గలియ మోడ్చినకన్నులు విచ్చి చూచి బొ
మ్మలు ముడి వెట్టి జంకెనయు మందపుకోపము మోముదమ్మి నిం
పలర నదల్చి యోరి యదయా దయ మాలి విధాత మున్ను నా
తల నిటు వాసె సద్దు మని తద్దయు మ్రాన్పడుకన్నె నెన్నెదన్. 114

చ. పలుమరుఁ గూడి నేదురుసుపైసరము ల్గనుపించువేళఁ గ
న్గలువలు విచ్చి చూచి యరగ న్నిడి ముద్దులు గుల్క నవ్వి మేల్
భళి యవునయ్య యేలి తిది బా గదె హా విడ కంచు మెచ్చి నన్
బొలుపుగ దృష్టి దీసికొను ముద్దియముద్దు దలంప శక్యమే. 115

చ. కులుకుమెఱుంగుగబ్బిచనుగుబ్బలు వెన్నున నాని యాత్మభూ
నిలయము తుంటి నంటఁ దొడనిగ్గులు దిక్కులఁ బర్వ సీత్కృతుల్
గొలిపి చిటుక్కుమంచు జిగిగోటికొనం దల గ్రుక్కి సొక్కఁ జే
సలరులతాంగి నెన్న మరు లగ్గల మయ్యె నదేమి చెప్పుదున్. 116