పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 99

క. చైత్రరథనందనాదిక
చిత్రమనోహృద్యమైన శృంగారవనిన్
మిత్రులతో రాధాశుభ
గాత్రి న్మదిఁ దలఁచి గరుడగమనుఁడు వల్కెన్. 99

సీ. ఎలనాగ నాచెంత కెంతెంత వచియించి
తనముద్దుచిలుకను బనిచెనొక్కొ
వచ్చి యిచ్చట నాదు వర్తమానము చూచి
పోయినశుక మేమి బొల్లెనొక్కొ
యేణాక్షి యది విని యీనినపులిఁబోలెఁ
బదరి భగ్గున మండిపడియెనొక్కొ
యది యొక్కనెపముగా నతివలు పగ చాటి
మించఁగా నేమి బోధించిరొక్కొ
తే. తోయజాననమది కేమి దోఁచెనొక్కొ
దైవమేగతిఁ జేయంగఁ దలఁచెనొక్కొ
కాల శని యుండెనో జవరాలిఁ బాసి
యేల వచ్చితి నాబుద్ధి కూలిపోను. 100

ఉ. కామిని చిల్క పోయి పలుక న్విని గుండె గభీలు మం చనన్
మో మొకయింత చేసికొని మోవి వడంకఁగ మేను వాడఁగా
గామునికాఁకలం గుమిలి కంటికిఁ బుట్టెఁడు నీరు నించి తా
నే మని యెంచెనో మదిని నెంత తపించెనొ యేమి చేసెనో. 101

సీ. నినుఁ బాసి నిమిషంబు నిలువఁజాల నటంచుఁ
గౌఁగింటఁ జేర్చుక గడియసేపు
నీవెంట నే వత్తు నేఁ దాళలే నంచుఁ
గరములు పట్టుక గడియసేపు
ననుఁ బిల్వ బంపుము నాయాన నీ కంచుఁ
గన్నీరు నించుచు గడియసేపు