98 రాధికాసాంత్వనము
తే. కరుణ వెన్నుఁడు నీమీఁదఁ గన్ను దెఱచె
నదిగొ దిశలెల్లఁ దెలివొందెననియె నొకతె
వచ్చె నాచాయవగకాఁడు వగవఁబోకు
మతనుభయ మేమిచేయునం చనియె నొకతె. 94
క. ఈరీతి వారిపలుకులు
సారెకు వీనులను సోఁక సతి మరుకాఁకల్
దీరగ వెలఁదులకడ నా
శౌరిం గోరుచు న టుండె సమ్మతమతి యై. 95
తే. అంత నచ్చట నర్జునాహ్వయునిసఖుని
జేరి రాధిక పంచినచిలుక యలుకఁ
జెప్పకయె పోయె నని చెప్పఁ జిత్తగించి
వనజనాభుఁడు మనము దిగ్గనఁగ లేచి.96
సీ. రాజాస్య గీలించు రవలపావలు మాని
ధవళాక్షి యిచ్చుకైదండ మాని
పడతులు దెచ్చిన బారిపల్లకిమాని
సుమగంధు లిడుచామరములు మాని
కాంచనాంగులు పట్టు కరదీపికలు మాని
శుకవాణు లను హెచ్చరికలు మాని
భామామణు లొసంగు బాగమ్ములును మాని
వనితలు విసరుపావడలు మాని
తే. జాఱుశిఖవీడ నరవిరిసరులు వాడ
బెట్టువగతోడ హృదయంబు కొట్టు కాడ
విరహ మొనఁగూడ ముత్యాలపేరు లూడఁ
జనియె నాప్రోడ శృంగారవనముజాడ. 97
వ. ఇట్లు చని. 98