పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 97

నట్టినాదేవు నెడఁబాసి నట్టివెనుక
జీవనం బేల తను వేల జీవ మేల. 89

ఉ. మానినులార మీర లనుమానము మానుఁడు నమ్మవద్దు నన్
గానిపనుల్ మదిం దలఁచి గాసిల నేటికి నేఁటి కీయొడల్
సూనశరాగ్ని కాహు తిడి సొంపు వహించెదఁ బక్ష ముంచుఁడీ
ప్రాణము ప్రాణనాయకుని బాసి తరించునె యెంత నిల్పినన్. 90

ఉ. ఈయెడఁ గాయము న్విడిచి యేగెద నంచు విచార మొంద లే
దాయదుసార్వభౌమునికి నామురవైరికిఁ గానికానిమై
పోయినఁ బోవకున్న నిలఁ బుణ్యమొ పాపమొ గ్రుడ్డికన్ను దా
మూయక విచ్చిన న్మఱచి మూసిన నేమి తలంచి చూడఁగన్. 91

క. ఐతే యింకొకనెంజలి
యాతరుణీస్మరునిమోము నవలోకింపం
బాతకురా లైతిఁ గదా
యీతరి ననుఁ గూర్చి వగవ నేటికి మీకున్. 92

క. అని పలుకు వనితఁ గనుగొని
కనకాంగులు కనుల నశ్రుకణములు దొరఁగన్
వనరఁగ నేటికి నేఁటికి
వనజాక్షుఁడు వచ్చువేళ వచ్చె నటంచున్. 93

సీ. హరి యదె వేంచేసె వరరథాంగస్ఫూర్తి
యను వంద వీక్షించు మనియెనొక తె
కమలాప్తుఁ డదె యీమొగం బయ్యెఁ బద్మినీ
హాసముల్ చెలరేగె ననియె నొకతె
గోవర్ధనుఁడు తమఃక్రూరప్రభల్ జాఱ
నల్లదె పొడ సూపె ననియె నొకతె
యదె లోకబాంధవుం డరుదెంచెఁ గుముదాళు
లణఁగి తల ల్వంప ననియె నొకతె