పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 95

సత్కీరవాహాయ జగదేకమోహాయ
మత్తశూర్పవధాయ మన్మథాయ
పద్మాకుమారాయ బాలికాధారాయ
మహనీయవిబుధాయ మన్మథాయ
మాధవప్రభవాయ మాధవసచివాయ
మానితాత్మకథాయ మన్మథాయ
తే. మంజుహర్షణబోధాయ మన్మథాయ
మధుపగుణచాపనాథాయ మన్మథాయ
మహితశృంగారసదనాయ మన్మథాయ
మనసిజాయ తుభ్యం నమో మన్మథాయ. 81

క. నగధరుఁ డెప్పటివలెఁ జెలి
తగు లొందిన నిన్నె యిష్టదైవమ వంచున్
దగఁ గొలుచుఁ బాపు మాపద
ఖగవాహన గోపతనయ కమలాదరణా. 82

తే. అనుచుఁ బ్రార్థించి వందనం బాచరించి
మృగమదముచేత గేదంగిరేకుపైఁ ద
దీయయంత్రంబు వ్రాసి రాధికను డాసి
యాక్షణమె దిట్టముగఁ గేల రక్ష గట్టి. 83

క. ప్రియునామమ్ములపలుకులు
ప్రియ మందఁగ నాలకించి పెంపు దలిర్పన్
నయనములు దెఱచి సరసిజు
నయనుని నటఁ గాన కడలి నాటినప్రేమన్. 84

శా. ఆకాంతామణి యంగజానలము లోకాతీతమై పర్వ నా
లోకాభీలదృగశ్రువర్షము లురూరోజాద్రులం గుప్పఁగా
శోకోద్రేకముచేఁ జెఱంగు మొగము న్సోకించి తా నేడ్చె న
స్తోకోన్మత్తమయూరరాజవిలసత్సువ్యక్తరావంబునన్. 85