పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 93

వ. అని విలపించుచుండుసమయంబున. 72

క. మరుఁ డురువడి నొఱ నరవిరి
కిరుసఝరీ లంచు దూసి కినిసి బిరానన్
పరుఁ జంటఁ జెమట పొడమఁగఁ
దరుణీమణియెదను దారిఁ దప్పక క్రుమ్మెన్. 73

క. తను వెల్ల జల్లు మనఁగా
ననమోవి చలింప మిగుల నడుము వడంకం
జను లదరఁ గురులు వదలఁగఁ
గనుదమ్ములు మోడ్చి వ్రాలెఁ గామిని మూర్ఛన్. 74

క. అత్తరి బిత్తరు లెల్లను
జిత్తమ్ములు తల్లడిల్ల జిత్తజుచివురుం
గత్తులపై వ్రాలిన య
మ్మత్తచకోరాక్షిఁ జూచి మమత దలిర్పన్. 75

సీ. కలకంఠినిట్టూర్పు గాడ్పులు నిగిడిన
వల్లీమతల్లిక లెల్ల సొరిగె
మదవతిపై సోఁకు మారుత మొలసిన
శుకపికనికరము ల్సోలి వ్రాలె
నలివేణి యొరగిన తలిరుటాకులసెజ్జ
నీరసంబై బూదిదారిఁ గాంచెఁ
దరుణిగుబ్బల నున్నతారహారంబులు
సొబ గెల్ల చిట్లి సున్న మయ్యె
తే. దమ్ము లిడఁబోవఁ గలువమొత్తము లయ్యె
విసము లయ్యెను జేర్చినబిసము లన్ని
మల్లె లయ్యెను విరిబొండుమల్లె లుంచ
నెందునను వీకఁజెడు దీనిఁజెందుకాఁక. 76