Jump to content

పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 85

పలచన చేసె నటన్నం
జెలియా మగవారిచనవు చెడ్డది సుమ్మీ. 36

క. అనువనజాక్షిని గని తాఁ
గనికరమునఁ జిలుక పలికెఁ గానీ వమ్మా
వనజాక్షువింత లెఱుఁగవె
కని తెల్పిన భారతంబుకత లై పెరుఁగున్. 37

సీ. కొననాల్కఁ గొని దానిననమోవి చెనకితే
కసుగందునో యంచుఁ గలవరించు
మొన వేళ్ళ మెలమెల్లఁ జనుమొనల్ నిమిఱితే
తగిలి నొచ్చునొ యంచుఁ దత్తరించు
వదన మించుక నాభిపై ముద్దాడి
బరువాయెనో యంచుఁ బలవరించు
గోటిచేఁ గప్పుముంగురులు చి క్కెడలించి
చురుకునేమో యంచుఁ బరితపించు
తే. జాజిపూఁదేనె గొనుతేఁటిఁజాడ నమరి
తాను రతి చేసి దాని పాదమ్ము లొత్తు
వలచువారును వలపించువారు లేరొ
వార లీబూమె లొనరింప లేరు గాని. 38

తే. దొరకరానిపదార్థంబు దొరకి నటుల
ఱొమ్ముననె కాని డించఁ డేయిమ్ము నైనఁ
బెట్టుచోటను బెట్టక వెలఁది నిపుడె
కట్టి కాచుక యున్నాఁడు కదలనియఁడు. 39

సీ. కనకాంగికట్టువర్గమె వల్లెవా టాయెఁ
గొమ్మపావడ చుట్టుకొనుట కాయె
నలివేణి నెమ్మోము నిలువుటద్దం బాయెఁ
జెలిగోటిలత్తుక తిలక మాయె