Jump to content

పుట:రాధామాధవము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

రచనాజాతీయత విశేషించి కానంబడుచున్నది గాని, సాంస్కృతికగ్రంథరచనాపద్ధతి గోచరించుట లేదు. మఱియు నిందు మనకవీంద్రుఁడు పెక్కుచోటుల స్వతంత్రరచనమును మిక్కుటముగఁ జూపియున్నాఁడు.

కవికవిత్వము

రాధామాధవకవి కవిత్వము సహజధారావిలసితమై, మృదుమధురపదగుంఫితమై, ప్రౌఢమై, హృదయంగమ మై యీతనికిఁ గలయాంధ్రగీర్వాణభాషాపాండిత్యవిశేషమును బ్రకటించుచున్నది. హృదయాకర్షక మగు నత్యంతభావసౌందర్యమును పిక్కటిల్లఁజేయు నపూర్వకల్పనలు గల పద్యరాజము లిందు లెక్కకు మిక్కిలినవి చూపట్టుచున్నవి. మనోజ్ఞపదభావవిలసిత మగు గ్రంథరచనమున నిమ్మహాకవి, కవిరాజశిఖామణి యగు నన్నిచోడమహారాజు, 'కవిబ్రహ్మ' బిరుదవిరాజి యగు తిక్కనసోమయాజి, 'సాహిత్యరసపోషణసంవిధానచక్రవర్తి' యగు నాచనసోమనాథుఁడు మొదలగువారితోఁ దులఁదూగఁగలిగినవాఁడు గాని సామాన్యుఁడు గాఁడు. ఈగ్రంథమునందు కవి తనకవితామాధుర్యమును గూర్చి,

“చ.

సరసులు చిత్తగింపుఁ డని చాటను; మామకవాణి సన్మో
హర యగునేని వారిహృదయంబుల కిం పొనరింపకున్నె? యె
వ్వరు పిలువంగ వచ్చి యళివర్గము లాత్మలఁ జొక్కుఁ, దీనియల్
గురియు ప్రసూనగుచ్ఛపరికుంచితమల్లిమతల్లికావనిన్?”