పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనర వృషభేంద్రు నెక్కి భూతలమునుండి | భవుఁడు వేంచేసెఁ గైలాసభవనమునకు.


సీ

అనిన నయ్యీశ్వరుం డానందచిత్తుఁడై గౌరియుం దాసును ఘనతతోడ
భళ్ళాణభూపాలుఁ బ్రమథులలోఁ బెద్దఁగాఁ జేసి పట్టంబు గట్టి మిగుల
మంగళగీతంబు లంగనల్ వెసఁ బాడ శంఖాదిరవములు సరవి మ్రోయ
నిరుగడ బ్రహ్మాదిసురలు సేవింపఁగఁ బ్రమథగణంబులు బలిసి కొల్వ
రమణతోఁ దానె తగ పరబ్రహ్మ మగుచు | జగములన్నియు నేలుచు శాశ్వతముగ
రత్నసింహాసనస్థుఁడై రాజసమున 1 నవిరళంబగు సుఖలీలఁ దవిలియుండె.


సీ

అనుచు సూతుఁడు నైమిశారణ్యవాసులై యలరుచుండెడు శౌనకాదులకును
రమణీయబసవపురాణోక్తమైన యీభల్లాణరాయభూపాలచరిత
వినుపించుక్రమమును బని మీఱ నా నేర్చువిధమున రచియించి విమలభక్తి
జనర మీ కొసఁగితిఁ దగ మీర లిందుల తప్పుల క్షమ చేసి దయ దలిర్ప
నిమ్మహాకావ్య మెప్పుడు నిద్ధరిత్రి | నేర్పుతో విస్తరిల్లి బుధేంద్రు లెల్లఁ
బొగడ నాచంద్రతారార్క మగుచునుండు | నటుల నొనరించి మముఁ బ్రోవుమయ్య శర్వ.


నరవరులకుఁ గృతు లిడి యి | ద్ధరణిం గవివరులు సంపదలఁ బొందుదురౌ
నెఱి నిహపరసుఖములకై | యురుబుద్ధిని నీకుఁ గావ్య మొసఁగితి నభవా!


ఈకథఁ జదివిన వ్రాసినఁ | బ్రాకటముగ వినినయట్టి భవ్యుల కెల్లన్
శ్రీకరముగ నభిమతములు | చేకురఁగాఁ జేసి కరుణఁ జేయు మనంతా.


అని యివ్విధంబున విన్నవించి.


క.

కరతలభరితకురంగా! చిరకరకరుణాంతరంగ! సింధునిషంగా!
కరిదనుజమదవిభంగా! గురుజనహృత్పద్మభృంగ! కుక్కుటలింగా!


మణి.

మురహరశరవర! మునిజనశరణా! సురవరవరద! కుసుమశరహరణా!
చిరతరగుణ! విలసితకరహరిణా! పరమపురుష! నిరుపమశశిభరణా!


మాలిని.

సదమలతరరూపా! సర్వలోకప్రదీపా! ముదితబుధకలాపా! ముఖ్యసత్యానులాపా!
విదళితఘనతాపా! విశ్రుతోద్యత్ప్రతాపా! కదనతలనకోపా! కాంచనాహార్యచాపా!


గద్య.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురంధర
ఘనయశోబంధుర కౌండిన్యగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్యపుత్ర బుధజన
విధేయ తిమ్మయనామధేయప్రణీతంబైన రాజశేఖరవిలాసంబను మహాకావ్యంబునందు
సర్వంబును దృతీయాశ్వాసము.