పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గాంచిసమంచితఘంటానినాదము ల్మొఱయఁ బుప్పొడి భూతికరణిఁ దనరఁ
బరిమళాదులవింతబాగులు చెలువార సొగసుపల్కులు శివస్తోత్రములుగ
నలర సన్మణిగణంబులు హారతులలీల నమరంగ ఫలరసాన్నములు చాల
లింగనైవేద్యములభంగి రంగు మీఱ | నతివ శివరాత్రి చేసెడుగతిని దనర
దేహ మభవున కర్పింపఁ దివిరి యపుడు | కరయుగము చాచి తుదిలేని కౌతుకమున.


క.

ఆలింగని నొనరఁగఁ దా | నాలింగనమునకుఁ దివియ నమ్ముద్దులప్రో
యాలిం గని మెచ్చి హరుం | డాలో నెలనాళ్లబాలుఁడై తగ నిల్చెన్.


గీ.

శంభుఁ డాచల్లమాంబహస్తములలోన | నివ్విధంబున బాలుఁడై నివ్వటిల్లి
యవ్వెలందుకమది గట్టిదనుచు నోలిఁ |జనులఁ జేపూర వాపోయెఁ జన్నుఁ గుడువ.


సీ.

అది విని చాటున నొదిగియున్ననృపాలుఁ డనె సతి కద్భుతస్వాంతుఁ డగుచుఁ
బొలఁతిరో! యిది యేమి పుట్టుగొడ్రాలవై యున్నదానికిఁ జోద్య మొప్పనిట్లు
శిశువు వాపోయెడిఁ జెప్పుమటంచుఁ దా లోపలి కేగక లోతుఁ దెలియ
నడిగిన నిట్లను నవనీశ కంటివా! మెచ్చుగా మిండఁడై వచ్చినట్టి
యొడయఁ డిప్పుడు బాలుఁడై యుండి పొగులు | చున్నవాఁ డనఁ గ్రమ్మర నువిదతోడఁ
దరణివంశాంబునిధిశీతకిరణుఁడైన | ఘనుఁడు భల్లాణధారుణీకాంతుఁ డనియె.


క.

బాలుని కివ్విటపద్ధతు | లేలా వలదనుచుఁ జెక్కు లిరుగడ నొనరం
వ్రేలుమును వేసి ఘృతమును | బాలును బోయుము చెలంగి బాలేందుముఖీ.


గీ.

నావుడు లతాంగి యిట్లను భూవరేణ్య | పాలు ద్రావఁడు కొట్టంగఁ గేలు రాదు
మూఁడుకన్నుల నలరియున్నాఁడు చూడ | నితరులకుఁ జెల్ల దివ్వింత యింతయైన.


గీ.

అనుడు నృపుఁ డింతిఁ దోడితెమ్మని యొడయని | నివ్వలికి మూఁడుకన్నులయీశ్వరుఁడు
వెఱ్ఱిగొఱ్ఱెను జేసినన్ వేశ్య నడిగి | కొనరి మనభక్తి దెలియంగఁ గోరె నిటుల.


క.

అనుటయు బాలునిఁ దోఁడ్కొని వనితారత్నంబు వేఁగ ద్వారము వెడలన్
ఘనుఁ డాశంకరుఁ డంతట | మునుపటితనచిఱుతచందములు మానె వెసన్.


సీ.

జడలలో మిన్నేఱుజాబిల్లి సికపువ్వు పులితోలు నునుశాలు పునుకసరులు
చేత ముమ్మొనవాలు చిలువ నూడిగములు నొసట మిక్కిలికన్ను విసపుఁగుతుక
వెలిమిడిమెయిపూఁత తెలిగిబ్బతత్తడినగ మేనగట్టులసామిపట్టి
మొగమునఁ జిఱునవ్వు మిగులఁ గూరిమిచూపు వన్నెమీఱెడు పాఁవజన్నిదములు
నలర నలువయు వెన్నుండు నఖిలసురులు | మునులు ప్రమథులు గొల్వ సమ్మోదమునను