పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కామాంధకారినై కడఁకతో నీరాకఁ గాచుచుండఁగ మూఁడుకన్నులయ్యెఁ
దలయేఱు బరువయ్యెఁ దగ మేను నగమయ్యె గళమూలమునఁ జందు నిలుకడయ్యె
వలనొప్ప మునుపటివగ దప్పె వలపు విరిగెను నడిరేయి సరవినయ్యె
నాకేటి కీవేశ్య నీకేటి నిజభక్తి బూటకంబులచేతఁ బ్రొద్దుఁ గడపి
నాడ వింతియె కాక భూనాథు లెచట! వ్రతము లెచ్చట! ఘనశైవమతము లెచట!
నెందుఁ గొఱగానిపొలఁతుక నిటులఁ దెచ్చి | యందుకొమ్మనువా రెందునైనఁ గలరె!


వ.

అని వెండియు నిట్లనియె.


గీ.

అనవలసి నిన్ను నిటువలె నంటిఁగాక | తగునె వేశ్యలతోఁ బొందు తాపసులకు!
నలసితివి భూప! మాకునై యధికముగను | దీనిఁ గైకొమ్మునీవైనఁ బూని యిఁకను.


సీ.

అనువిటవరుని గన్గొని వినయోక్తి నిట్లను మనుజాధీశుఁ డనువు మీఱ
నయ్యలు మీ రెట్టు లాడినఁ దగుగాని క్షితి నయ్యలకుఁ దెచ్చు చిగురుఁబోండ్లు
నవ్వలుగాఁ జూడ నర్హంబు మాకును దవిలి మీ కిట్లాడఁదగునె మమ్ము?
నాఁకలి గొన్నచో నన్న మెవ్వరికైనఁ గలిగిన విడనాడఁ గాదు సుమ్ము
మీమదికి సంతసంబైన మీననేత్ర | నరయుచుండంగఁ దడవయ్యె నయ్య యింకఁ
దప్పు లెన్నక కైకొమ్ము తరుణి నిపుడు | కరుణ నని భక్తి నడుగుల కొరుగుటయును.


క.

నృపతిఁ గృపఁ జూచి యపు డా | కపటపుదిటజంగమయ్య కడునవ్వుచు నో
తపనకులవర్య ఱోయఁగ | నిపు డాడితిఁ గాక సాటి యేరీ నీకున్.


ఉ.

కావలెనన్నమాత్రమునఁ గౌతుకమున్ జెలువార వారరా
జీవదళాక్షిఁ దెచ్చితివి చె న్నలర న్బదివేలు సేయునీ
నీభావజుచేతిమేలినునుబంగరుబొమ్మను ముద్దుగుమ్మ న
జ్జీవునకు న్విధాతకును శేషునకుం దరమే నుతింపఁగన్?


క.

ముద మొదవఁగ వరచందురుఁ | గదుమఁ దివురు నువిదనుదురు కడుఁబొదలెడుతు
మ్మెదకొదరకడుపుఁ జెదరఁగ | నదలించు న్సుదతిమృదువులౌ పెన్నెరులున్.


క.

వాసిగ నీసుదతీమణి | నాసముగా సమమె యంచు నవగంధఫలి
న్భాసురగతిఁ గన్గొని పరి | హాసం బొనరించు సంతతాంచితలీలన్.


గీ.

చెలఁగి జగములు గెలువంగఁ దలఁచి యిడిన | మరునిబలుసింగిణీవిండ్లు తరుణిబొమలు
కడఁక నవ్విండ్లఁ బూన్చిన కలువతూఁపు | లీపయోజానన మిటారిచూపు లరయ.


క.

చిగురాకుకెంపుబింబము | పగడంబును జెందిరమును బంధూకము ని