పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ధారుణీశ్వరుబుద్ధి పూరి మెసంగెంబో సరగ నెందుండియో జంగ మొకఁడు
చేరి వారాంగనఁ గోరినతఱి నియ్యఁగొనకొని యెచ్చటఁ గొదువయైనఁ
దనభక్తి చెడకుండఁ బనివడి వేశ్యగా నిల్లాలిని నొసంగె నిట్టిచిత్ర
మొప్పెడుననువార లొకకొందఱును భళా చాన యొక్కతెయైన మానవేంద్రుఁ
డేటికి నొసంగు ముద్దియ లిద్ద ఱగుటఁ | జేసి వారలు తమలోనఁ జెలఁగి పోరు
చున్నఁ గన్గొని య్పి డిచ్చుచున్నవాఁడు | గాని నిక్కంపుభక్తి గాఁగలదె యిటుల?


క.

ఇచ్చిన నిరువురనొక్కట | నచ్చంబగు భక్తితోడ నర్పింపక యీ
కుచ్చితములు దగవనుచున్ | మెచ్చక యొకకొంద ఱేమిమే లనువారున్.


చ.

పురములు వాహనంబులును భూషణము ల్ధనధాన్యము ల్నవాం
బరములుఁ బాఁడిధేనువులుఁ బ్రార్ధన సేయక జంగమయ్య యే
తెఱఁగున వేశ్యఁ గోరె! నతిధీరత న ట్లతఁ డింతిఁ గోరిన
న్ధరణిపుఁ డెట్టు లియ్యకొనెఁ ! దా నని పల్కెడువారు కొందఱున్.


క.

ఇయ్యకొని వారసుందరి | యెయ్యెడలం గల్గకున్న నిల్లాలి నిటు
ల్సయ్యన నొసఁగుట ఘనతయె | యియ్యిలపతి కనుచుఁ గొంద ఱెన్నెడువారున్.


సీ.

ఆసరోరుహనేత్రయైనఁ గాదనకిట్లు పతివెంట వేశ్యయై భవ్యగతిని
జనినంత భక్తియే యనువారు కొందఱు గట్టిగా భక్తిమార్గంబు పూని
నప్పుడే భక్తుండు చెప్పినవిధమెల్లఁ జేసిన నిల్లాలు సేయకున్న
నదియపో చిత్తినియనువారు కొందఱు సతికి భర్తకు నొక్కమతియయైనఁ
గల్గునభిమత మిది కల్ల గాదు నృపుఁడు | లీల నీజంగమునము నిల్లాలి నొసఁగి
హరుని మెప్పించి బొందితో నరుగఁగలఁడు | సరగఁ కైలాసమున కెల్లజనులు నెఱుఁగ.


క.

అనువా రొకకొందఱునై | కనుఁకొన నవ్వేళ నృపతి కాంతామణిఁ దో
డ్కొని చని యల జంగమరాయనిసన్నిధి నునిచి యిట్టు లనియెం బ్రీతిన్.


క.

తగుచిగురుఁబోఁడిఁ దెచ్చితి | నొగి మీకుఁ బరిగ్రహింపుఁ డోసామి! యనన్
నగుమొగ మలరఁగ నపు డ | జ్జగతీపతితోడ విరాగిచంద్రుఁడు పల్కెన్.


గీ.

రమ్ము భల్లాణ నిక్కంపురాజ వనుచు | నెమ్మదిని జాల నీమాట నమ్మియుంటి
మెంత దడవయ్యెఁ బడఁతిఁ దేనేని యిపుడు | పూని నీయోజ మెంతైన మానగలవె?


క.

రంగుగ జంగమవిటుఁ డను | చుం గడునిబ్భంగి జూలకఁజూచి తొడబడవన్
వెంగళివి భూప నీకే | సంగతి నలరారుమానసము నామీఁదన్.