పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సుమశరారామమార్గభాసురసమగ్ర | లగ్నకలకంఠయుతవల్లి లంజతల్లి.


సీ.

కుఱుచలై తఱుచుగా నెఱిసినవెండ్రుక లొప్పుమీఱఁగ దువ్వి కొప్పు ముడిచి
యిలఁబ్రాంతచెప్పుటట్టలఁ బోలి వ్రేలాడుకుచముల ఱవికచేఁ గుదియఁబట్టి
తొడిగినకుబుసంబువడువున మడత లేర్పడియెడునొడలిపైఁ బసపు రాచి
యెలుఁగుతోలును మీఱి యెంతయు మాసిన పెద్దపుట్టము చాలఁబ్రీతిఁ గట్టి
బొరుసునొసటను జంద్రఁపుబొట్టుఁ బెట్టి | యడుసుకన్నులఁ గజ్జలం బడర దిష్ఠి
బోసినోట మదమలంబుఁ బూని యిటుల | విటులఁ బలుమాఱు నగఁజేయు వృద్ధవేశ్య.


గీ.

పద్మమయినను దగుమహాపద్మమయిన | శంఖమయిన నొసంగినఁ జాలకుండు
ధనదు మెచ్చ దొకింతైనఁ దనకుఁ గల్గు | విత్త మంతయు నీకున్న వేశ్యజనని.


క.

వసఁ ద్రాగినపులుగుక్రియ | న్విసువకతగఁ బ్రేలుకొంచు వేశ్యాంబ కడుం
బిసరేఁగి బూతులాడు | న్బసఁ గల్గనియీగి యడఁగఁ బల్లవతతులన్.


ఉ.

ఆకులు పోఁకలు న్మణులు హారములు న్బహుగంధసారము
ల్కోకలు రూకలు న్మదిని గోరినయట్టి సమస్తవస్తువు
ల్ప్రాకట మొప్ప మాయ లొగిఁబన్ని భ్రమించుచు నేర్పు మీఱఁగాఁ
జేకొనుఁబో విటావళులచే గణికాంబ విచిత్రవైఖరిన్.


గీ.

మిండఁ డొకనాటిరేయి రాకుండెనేనిఁ | గాసువీసంబు చేతికిఁ గల్గనందు
కించుకేనియు నిదురఁబోనీదు కూఁతు | గడనపూఁబోఁడియవ్వ పెన్కంచుమువ్వ.


వ.

ఇట్లగుటం జేసి పల్లవవిరహితమైన వేశ్య మీ రిచ్చుధనంబుఁ గొని జంగమవిటునికతకు
రాకుండునే యని యథార్థంబుగఁ బల్కిన విని.


క.

నమ్మక నృపభటు లతిశీ | ఘ్రమ్మునఁ గ్రమ్ముకొని సకలగణికాజనగే
హమ్ములు నిమ్మగ దూరి ము | దమ్మునఁ బరికించుకొనుచుఁ దగ నచ్చోట్లన్.


క.

ద్యూతమధుపానమృదుసం | గీతసుసాహిత్యనృత్యకేళులచేతం
బ్రీతిఁ జెలంగు భుజంగ | వ్రాతంబులఁ గనిరి చిత్రవైఖరి మెఱయన్.


ఉ.

ఈగతి నుండఁ జూచి ధరణీశ్వరుపాలికిఁ జారు లెంతయు
న్వేఁగమ చేరి తద్విధము చిన్మయలీల నెఱుంగఁ జెప్పిన
న్బోగముచానఁ దే కిటుల బొంకులు పల్కుట మీ కొకింతయు
న్బాగగునే యటంచు నరపాలుఁడు కోపము మీఱఁ జూచుచున్.


క.

ఉన్నంత పొరుగుపల్లెల | కు న్నేగినదూతలెల్ల గొబ్బున నపుడే