పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రావె కోకిలవాణి రా సరోరుహపాణి రా మధువ్రతవేణి రమ్ము తరుణి
రావె నారీశిరోమణి రమ్మురమణి | రమ్ము నవచంద్రికాహాస రాజహంస
యనుచు వేవేఁగ నింటింటి కరిగి యిటులఁ | దలవరులు వారకాంతల నలరఁ బిలిచి.


క.

ధనములు మణిభూషణములు | ఘనతరచిత్రాంబరములుఁ గలసంబులునుం
గొనుఁ డివె విటజంగమునకుఁ | బనివడి నిద్దురకు నిపుడు ప్రమదము మీఱన్.


గీ.

వనజముఖులార! ధారుణీవరునియాజ్ఞ | యిట్లు కావున మసలక యీక్షణంబ
వలసినంతధనంబును వరుసఁ గొనుచు | వేఁగముగ రండు జంగమవిటునికడకు.


వ.

అని పల్కుటయును.


సీ.

నెఱజాణఁడొకఁ డింట నిద్దురకున్నాఁడు రాఁగూడదనె నొక్కరాజివదన
కోడెకాఁడొకఁడు దాఁగోరిన ధన మిచ్చి వదలనీఁడనె నొక్కవాలుగంటి
మిగులఁగూరిమి చేయు వగకాని నెడఁబాయఁదగదు రాననె నొక్కచిగురుఁబోఁడి
పల్లవుఁడొకఁడు దర్పకకేళి కీవేళఁ గాఁచినాఁడనె నొక్కకంబుకంఠి
ననువుకాఁడొకఁ డాసించి వినయలీలఁ | దవిలియున్నాఁడనియె నొక్కధవళనేత్ర
విటశిరోమణియొకఁ డిలు వెడలనీక। దంటయైయున్నవాఁడనె దంటయొకతె.


ఉ.

మిండనిఁ బాసి రాఁదగదు మిన్నక పొండనె నొక్కలేమ చె
ల్వుం డిదె చూడుఁ డల్ల గదిలోనియతండనె నొక్కరామ భూ
మండలిఁ బేరుగల్గు సుషమంబగుమేలిపసిండిసొమ్ములీ
తం డొసఁగం గడించి చనధర్మము గాదనె నొక్కభామయున్.


గీ.

ఇట్లు చెలులెల్లఁ దమవిధం బెఱుఁగఁజెప్పి | రందు గొందఱు ప్రోడలౌ నిందుముఖులు
మందమధురోక్తు లలరార మానవేశ | కింకరుల కిట్లు పలికిరి శంకలేక.


క.

వినుఁ డెఱిఁగించెద మెంతయుఁ | బనివడి గణికాజనంబు పద్ధతులెల్ల
న్వినయం బలరారఁగ నో | ఘనులార సవిస్తరంబుగా నిఁక మీకున్.


సీ.

విటుఁడు లేని రేయి వేదనఁ జెందుచు | నిదుర కంటి కెఱుఁగ నేరకుండి
కా సొసంగునట్టికడజాతివాఁడైనఁ | గల్గఁగోరు వారకాంత మదిని.


సీ

కడుఁగురూపినినైనఁ గందర్పనిభుఁ డంచు నభినుతి యొనరింతు రలఘులీల
నంత్యజన్మునినైన నమలవంశజుఁ డంచుఁ బల్కుదు రెంతయుఁ బ్రౌఢి దనర
నతిమూఢమానసుండగు మానవునినైన సరసుఁ డటందురు సరభసమున
బ్రహ్మహంతకునైనఁ బరమధార్మికుఁ డంచు గణుతింతు రెపుడును గ్రమముతోడ