పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ

నిక్కు జక్కవదోయి నెక్కసక్కెములాడు చనుగుబ్బ లురమున నొనరనాని
భుజయుగం బలర మూపున లీలఁ గీలించి చెలువొప్పఁ జెక్కునఁ జెక్కుఁ జేర్చి
పలుమాఱు గళరవంబులు మీఱి జెలగంగ నిమ్ముగా మరునిల్లు చెమ్మగిలఁగఁ
గొనగోటిపోటు లొయ్యన మర్మము ల్నాట వగలచే బెదరుమై వడకు దోఁపఁ
జొక్కి బిగికౌఁగిలింతలఁ బెక్కుక్రియలఁ | బ్రేమ దళుకొత్త వసియించి పిదప నుపరి
సురతమును బ్రోడయై సేయుసుందరాంగి | కావలయుఁ జుమ్ము ధారుణీకాంత యిపుడు.


వ.

మఱియును.


సీ.

ధనగర్వమునఁ బల్లవునిం దృణీకృతలీల గణన సేయని పెల్లుకత్తె గాక
కలహించి వేఁడుకకాని నెంతయు నెగ్గులాడుచునుండు గయ్యాళి గాక
నెమ్మది యొరునిపై నిలిపి మారునికేళి నలరఁ దేలింపని తులువ గాక
ప్రేమచేఁ బిలిచిన బేలయట్టులఁ బల్కనొల్లని మాయలబెల్లి గాక
యొకనిచే విత్త మంది వేఱకనితోడఁ | గలిసి వర్తించు బల్దోనకారి గాక
పూని యేప్రొద్దు నిద్దురపోతు గాక |మదటయును గాక పరికింప మలిన గాక.


గీ.

విటునితోఁ గూడియున్నట్టి వెలఁది గాక | బానిసెయు రోగియును గాక పాపి గాక
బేలయును గాక తగమగనాలు గాక | యున్నవాల్లంటిఁ దెప్పింపు ముర్వినాథ!


విను చిత్తిని శంఖిని హ | స్తిని పద్మిని యనెడు నాల్గుతెఱఁగులసతు లం
దునఁ బేరెన్నికయగు | ద్మిని గావలెఁ జుమ్ము మాకు మిహిరకులేశా!


శివపాదభక్తినిరతయు | నవిరళసౌందర్యవతియు నతిపుణ్యగుణ
ప్రవిమలతరహృత్కమలయు | నవనీశ్వర మాకు నిచ్చునది యిపు డెలమిన్!


సీ.

ఘనసారమృగమదగంధసారాసేకసంతతనవ్యవాసనలచేత
మౌక్తికాంబుజరాగమరకతనీలాదిదివ్యమాణిక్యదీధితులచేతఁ
దరుణేందుబింబసుందరదర్పణావళితరళితఘనధగద్థగలచేత
సౌపర్ణపర్యంకసంవ్యాప్తమల్లికాద్యతులితకుసుమసంహతులచేత
సరవిం దెఱయిడ్డచందువాసిరులచేతఁ | బ్రకటితములగు జాలవల్లికలచేత
సొరదిఁ బేరైన నిఖిలవస్తువులచేత | నలరు కేళీగృహంబు గావలయుఁజుమ్ము.


వ.

అనిన నృపాలుం డిట్లనియె.


గీ.

అట్టె కానిమ్ము దేవ మీ రానతిచ్చు | క్రమము మీఱంగ నిప్పుడే గడనసతిని
నలరఁ దెప్పింతునని పల్కి యాక్షణంబ | కౌతుకం బాత్మ నెంతయుఁ గడలుకొనఁగ.