పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అపమృత్యుముఖ్యదోషాంభోధరములకు జంఝానిలంబులు శంభుకథలు
సజ్జనస్తోత్రపాత్రముల్ శంభుకథలు | సకలసంపత్కరంబులు శంభుకధథలు
శాశ్వతైశ్వర్యయుక్తముల్ శంభుకథలు | నవనఫలదాయకంబులు శంభుకథలు.


గీ.

గిరిశకథలందు నీవు నేర్పరివి మున్ను | శంభునకు వేశ్యగాఁ బ్రియసతి నొసంగి
యతని కారుణ్యమునకుఁ బాత్రత వహించి | నట్టిమనుజేంద్రుకథఁ దెల్పవయ్య మాకు.


క.

అనవుడు సూతుఁడు మునులం | గనుఁగొని వెస నిట్టు లనియె గౌరీశుకథల్
వినిపించెదనని పూనఁగ | జనులకుఁ దరమగునె? యోగిసంఘములారా!


శా.

వాణీశామరవల్లభాదులగు గీర్వాణుల్ నిజంబొప్ప న
య్యేణాంకార్ధవిభూషణుం దెలియఁగా నింతేనియుంజాల రీ
క్షోణిన్ మానవుఁ డెట్లు నేర్చు? దృఢభక్తుల్ గొంద ఱాచక్రభృ
ద్బాణుం గాంతురు సత్కథావళులు నిత్యంబుం ప్రశంసించుచున్.


క.

ఘనుఁడగుపినాకి చరితలు | వినయవివేకజ్ఞుఁ డగుచు విలసిల్లెడు సూ
తునికిం దెలిసినవిధమునఁ | బనివడి యితరులకుఁ దెలియఁబడు టె ట్లరయన్.


క.

ఘనశైలంబు లుంచెడు ము | వ్వననిధిలో నోడ నిలిపి వడి నీదెడుమ
ర్త్యునికరణి భక్తి యను నా | వను గిరిశకథాసుధార్ణవం బీదఁదగున్.


గీ.

అట్లు గావున నతనిపాదాబ్జయుగము | భక్తితోడుత మది నిల్పి ప్రకటగతిని
మీరలడిగినకథలెల్లఁ గోరి కలర | నెఱుఁగఁబలికెద వినుఁడని యిట్టులనియె.


క.

శ్రీకరమై రిపుజనహృ | ద్భీకరమై త్రిభువనప్రధితశివమతర
త్వాకరమై యనవరతశు | భాకరమై సింధుకటకమను పురి వెలయున్.


మ.

శశికాంతోపలజాలనిర్మితమహాసౌధాగ్రభాగోల్లస
ద్విశదాబ్జారిముఖీజనాంచితముఖావిర్భూతమందస్మితా
తిశయప్రస్ఫుటకౌముదీముదితహృద్దేశానిశోద్యచ్చకో
రశికుంతావళియై తనర్చుఁ జెలువారన్ దత్పురం బెంతయున్.


చ.

అరయఁగ నప్పురిం గనకహర్మ్యతలంబులఁ గేలిసల్పు సుం
దరుల యొయారముల్ గని ముదంబున నచ్చరలెల్ల మెచ్చి భా
సురగతిఁ గాన్కలంపిన ప్రసూనపుదండ లనంగ నెల్లెడం
దరుచుఁగ రత్నతోరణకదంబము లందము మీరు నెప్పుడున్.


మ.

లలనల్ తత్పురసౌధవీథులను డోలాకేళిచేనుండి తా
రల బాలార్కుని మింటఁ జూచి తమపాదాబ్జద్యుతిం బోల రాఁ