పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

రాజశేఖరచరిత్రము


ఉ.

వచ్చె ననేకదూరము జవంబునఁ దేజులు చాలడస్సె నీ
విచ్చటి కాననాంతరమహీస్థలి యారసి నీరు చూపి లేఁ
బచ్చిక మేపు మిక్కనకపంజరకీరము నిప్డు మిక్కిలి
న్నొచ్చిన దీపథశ్రమము నూత్నఫలావళిఁ దీర్పఁగాఁ దగున్.

115


గీ.

మరుని బాహుప్రతాపవిస్ఫురణఁ గెరలి
హరుని గెలిచెద నని పోవు కరణి విహర
మాణవిహగగరుజ్జాతమారుతముల
మింటి కెగయుపరాగంబుఁ గంటె యెదుట.

116


ఉ.

చూచితివే యినప్రభలు సోఁకని మంజునికుంజపుంజముల్
చూచితివే ఫలావళులజొంపములైన రసాలసాలముల్
చూచితివే విధూతఫలశుద్ధవితర్దిక లల్ల పుష్పనా
రాచవిహారసౌధమనఁ గాదగు కానన మింత యొప్పునే.

117


క.

తరుణపవమానమదకే
సరిపోతము విటపికుంజసామజకుభాం
తరములు గ్రొవ్వినఁ దొరిఁగెడు
గురుమౌక్తికభాతి రాలెఁ గ్రొవ్విరు లవిగో.

118


వ.

అని వర్ణింపుచు.

119


లయగ్రాహి.

భూరి సహకారఫలసారములు గ్రొచ్చి కడు
                       పారఁ దిని యాముకొని మారుని హయంబుల్
సారెఁ బథికు ల్బెదరఁ గోరుచు దిశ ల్గలయఁ
                       బేఱెములు వాఱుచు నుదారగతి నాడన్
సారసమరందరసపూరములు గ్రోలి ప్రతి
                       వార మనివార మని వారణ నటింపన్
భూరమణశేఖరకుమారుఁ డనురాగమునం
                       దేరు డిగి యవ్వనము జేరఁ జని క్రేవన్.

120