పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19


ఉ.

అప్పుడు బంధుమిత్రసచివాన్వితుఁడై మహనీయవైభవం
బుప్పతిలన్ ధరామరసముత్కరముం బిలిపించి యిచ్చెఁ బో
తెప్పలుగాఁ గరుల్ హరులు ధేనువు లంబరముల్ మణివ్రజం
బప్పతి యప్పతిం దెగడునట్టి సమున్నతదానవైఖరిన్.

89


మ.

నరనాథోత్తముఁ డీగతిన్ వివిధదానప్రౌఢిఁ బుత్త్రోత్సవ
స్ఫురణంబొప్ప ఘటించి సూతకదినంబుల్ పుచ్చి దాక్షాయణీ
వరకారుణ్యవిశేషబంధుఁ డగుటల్ వర్ణింపుచున్ రాజశే
ఖరనామం బొనరించెఁ బుత్త్రకునకుం గౌతూహలాయత్తుఁ డై.

90


శా.

వైరించప్రతిభావదావదవచోవైయాత్యసాతత్యస
త్యారూఢస్థితి పాండవాగ్రజమహీయస్వచ్ఛకీర్తిచ్చటా
పారావారనిమగ్నశత్రుగణశుంభత్పూర్వభూభృద్దిశా
నారీమన్మథబంధురక్షణచణా నాదిండ్లవంశాగ్రణీ.

91


క.

చతురతరవచనరచనా
చతురానన త్రిచతురాశ్వసప్తిజవానీ
చతురంగఖురరజోవిక
చతురాషాణ్నయనకమల సముదగ్రబలా.

92


మాలిని.

హరిచరణపరయోజధ్యానసంధానమార్గా
స్థిరమతిగుణధారా శిక్షితాఘప్రచారా
సురసురభివితీర్ణిస్తోత్రపాత్రప్రకారా
గిరిచరదరివీరా కృష్ణమాంబాకుమారా.

93

గద్య
ఇది శ్రీమదఘోర శివాచార్య గురుకరుణావిశేషలబ్ధసారస్వత
మాదయామాత్యపుత్త్ర మల్లయనామధేయప్రణీతం బైన
రాజశేఖరచరిత్రంబును మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.