విపశ్చిద్భావ = విద్వాంసులహృదయములకు, “విద్వాన్విపశ్చిద్దోషజ్ఞః" అని అ. విశ్రామసీమా = విశ్రమస్థాన మైనవాఁడా! విశ్రామయని ఘఙ్ప్రత్యయముగాఁ జెప్పినందుకు “తమృషిం మనుష్యలోకప్రదేశ విశ్రామశాఖిన" మ్మని మురారియు, "విశ్రామం లభతామిదం చ శిథిలజ్యాబంధమసద్ధనుః” అని కాళిదాసును జెప్పిననుగాని, "మితాం హ్రస్వః” అనుసూత్రమున హ్రస్వము రాఁగా విశ్రమ యని యుండవలెననియు, విశ్రామోపశబ్ద ఇతి కాశికాయా మన్నందువలన విశ్రమశబ్దమే యఁండవలెఁ గనుక, “కథం కథం విశ్రామ” అని వ్యాసకారులు చెప్పినంగాని వ్యాకరణాంతరమువలన నుపధావృద్ధి రావలెఁ గనుక. “విశ్రాంతిం భవతా” మని శాకుంతలవ్యాఖ్యానములోనును వ్రాసినాఁడు గనుకను, విశ్రాంతిసీమా యనెడునదియు మంచిపాఠము. పృథు = అధికమైన, చిదమృతధారా = జ్ఞానామృతధారచేత, అభీక్ష్ణ = నిరంతరమును “ముహుః పునఃపునశ్శశ్వదభీక్ష్ణమసకృత్సమా” అని అ. సిక్త = అభిషిక్తుఁడైన, ఆకువీటిప్రథితతిరుమలక్ష్మాపతి = ఆకువీటితిరుమలనాయనియొక్క, అపత్యాగ్రజన్మా= జ్యేష్ఠపుత్రు డైన పెదవేంకటాద్రి గలవాఁడా?
గద్యము. ఇది మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వతసంపదానంద నందవరాన్వయక్షీరపారావారరాకాసుధాధామ ముద్దరాజగణపయామాత్యపెదరావధీమణిప్రదర్శితం బైన రాఘవపాండవీయాదర్శంబునందుఁ బ్రథమాశ్వాసము.