Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యించుచో సంస్కృతాంధ్రపదములకు విభాగమాత్రగ్రాహ్యముగా మేళనము గలుగునట్లు పదసంయోజనము చతురముగాఁ గూర్చుటం జేసి యిచ్చట సంస్కృతాంధ్రభాషాద్వయసభంగశబ్దశ్లేష చెప్పఁబడియె.

క.

“ఏనుం గనికర మరయక, పూనితిఁగా కిట్టియెడలఁ బోసఁగునె యేయన్
గానమె కాలనియమగతి, తో నావేఁట మునియుగముఁ ద్రుంగించెఁ దుదన్.”

ఆ-1. ప-24.

ఇందుఁ బూర్వార్ధమున రామాయణార్థమున 'ఏనుంగు + అని + కరము + అరయక' యనియు, భారతార్థమున 'ఏను + కనికరము + అరయక' యనియు నాంధ్రశబ్దములకు సభంగశబ్దశ్లేషకల్పన చేయఁబడియె. ఉత్తరార్ధమున భాషాద్వయసభంగశబ్దశ్లేష యూహ్యంబు.

శా.

"అక్షుద్రప్రథమానదివ్యశరసంప్రాప్తిం బ్రశాశించునా
కుక్షిద్వంశవతంసుఁ గన్గొని మహాగోదావరీతీరస
ద్రక్షోపాయపథంబు నేఁడు దొరకెన్ రం డంచు సంరక్షణా
పేక్షం దద్వనభూమిదేవతలు సంప్రీతిం గడున్ మూఁకలై.”

ఆ-3. ప-65.

ఇందు రామాయణార్థమున 'మహా + గోదావరీ + తీర + సత్ + రక్షా + ఉపాయపథం' బనియు, భారతార్థమున 'మహత్ = ఆగః + దావ + రీతీ + రసత్ + రక్షః + అపాయపథంబు.' (అనఁగా గొప్పయపరాధము గలవారును దావానలమురీతిని మ్రోయుచున్నవారు నగురాక్షసులనాళమార్గము) అనియుఁ బదచ్ఛేదభేదమున నర్థభేదము గలుగునట్లు సంస్కృతసభంగశబ్దశ్లేషకల్పన చేయఁబడియె.

క.

"ఆకళంకిత ని ట్టనుఁ గొం, చక యేమి మనము సమరసముదారక్రీ
డకు నొండొరు మార్కొనుట దొ, రకు ననివచ్చితి నెఱుంగరావాకినుకల్.”

ఆ-1. ప-81.

ఇందు రామాయణార్థమున ఏమీ మనము = మన మిద్దఱమనియు, భారతార్థమున మీమనము = మీమన స్సనియు నన్వయించుచో మనము అనుద్వ్యర్థ మగు నాంధ్రశబ్దముఁ బ్రయోగించుటం జేసి యాంధ్రభాషార్థశ్లేష కల్పింపఁబడియె.

క.

“ఘనవిగ్రహజృంభణమున, ననయము దనకట్లు దెగఁగ నవ్వాహినిఁ గ్రీ
డన గెలిచి వచ్చునబ్బా, లునిఁ గని వెఱఁ గంది రాత్మలో నచటిజనుల్.”

ఆ-1. ప-25.