Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. యతి = ముని, ఎంతేన్ = అధికమైన, తనయార్తిన్ = తనదెసకు, చేడ్వడినవాఁ డై = లోనై, ఆత్మజాయాసమాగత మైనప్పుడు = ఆత్మభార్యాసంయోగ మైనయపుడే - అని పూర్వోక్తానువాదము. మేనుఁ బాయుమని, శాపించెన్ = శపించెను. సంతతి లేకుండెడిచో, తదాశన్ = ఆసంయోగాపేక్షవల్లనే, తాఁ బోవుట, మిగులన్ = మిక్కిలియు, మదికిన్ = మనస్సునకు, ధృతిమైన్ = ఎంతధైర్యము గలిగిన ననుట. ఓర్వఁగ వచ్చునా? తాళరాదని కాకుధ్వని. అంచున్, జనపతి యని మీఁదటిపద్యములోఁ గర్త. ఎన్నుచును.

రామ. తనయునియొక్క, ఆర్తి, ఆత్మజ = పుత్త్రునియొక్క, ఆయాసము = శోకము, దదాశ = సంతానాపేక్ష, మిగులన్ = పూర్ణ మైనను, తాఁ బోవుట, ఎట్లేనియున్ = ఎట్లైనను, నామదికిఁ జింతింప నోర్వవచ్చును. కడమ సులభము.

క.

జనపతి దాన నతివ్యధ, మనస్కుఁ డై యిట్టి దయ్యె మత్సుచరితవా
సన యిఁక నేమని నిజపురి, కిని జనియెద ననుచు నాత్మకిల్బిషశంకన్.

35

రామ. జనపతి = దశరథుఁడు, తాను, అనతివ్యధమనస్కుఁడై = అధికవ్యధ లేని మనస్సు గలవాఁడై, శాపము పుత్రహేతు వాయెఁగనుక, మత్ = నాయొక్క, సుచరితవాసన = జన్మాంతరసుకృతసంస్కారము. “వాసనాభావనా సంస్కారోనుభూతాద్యనుస్మృతిః" అని అ. ఇట్టిదయ్యెన్, శాపమై ఫలించెననుట. ఇంక నేమి = ఇంక విచారమునకు నిమిత్త మేమి, అని = ఈలాగున నెంచుకొని, నిజపురికి = అయోధ్యకు, చని = పోయినవాఁడై, ఎదన్ = మనస్సునందు, ననుచు = చిగుర్చునట్టి, అభివృద్ధియగునది యనుట. అర్థాంతరము. ఇంక నేను, మని = కృతార్థుఁడనై, నిజపురికి = ఆయోధ్యకు, చనియెద ననుచు, ఆత్మ = తనయొక్క, కిల్బిషశంకన్ = పాపభీతిచేత, దానంబు చేసె నని ముందరిపద్యమున కన్వయము.

భారత. జనపతి = పాండురాజు, దానన్ = ఆయెన్నికచేత, అతివ్యధమనస్కుఁడై = ఆధికవ్యధ గలమనస్సు గలవాఁడై, ఇఁక నేమని, నిజపురికి = హస్తినగరమునకు, చనియెద ననుచున్. కడమ సమము.

క.

గణనాతీతము లగుగో
గణములు వేదండఘోటకస్తోమములున్
మణులు ధనధాన్యములు బ్రా
హ్మణులకు దానంబు సేసె నాతడు మఱియున్.

36

రెంటికి సమము సులభము. ఇఁక నాల్గుపద్యములకుఁ గుళకము.