Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

బ్రాణములు వెచ్చవెట్టక బ్రతికి పోవ
లేఁ డకట నాకు నరుఁ డేమి లెక్క యనుచుఁ
దనకురుబలౌఘరక్షావిధానమహిమ
గడఁకఁ బెనుపంగ నతనిపై నడచి పోరె.

229

రామ. ఆమఱునాఁడు, ప్రౌఢిమత్ = ప్రకాశముగల, రవి = సూర్యునియొక్క, భ = కాంతివంటికాంతి గలవాఁడు, ప్రదళిత, బహువైరి, పంక్తిగళుఁడు = రావణుఁడు, నాకు, నరుఁడు = మనుష్యుఁడు, ఏమి లెక్క యనుచుఁ దనకు, ఉరుబలౌఘ = అధికసేనాసమూహముయొక్క, రక్షావిధానమహిమ, కడఁకన్ = రోషమును, పెనుపంగ, అతనిపైన్ = రామునిమీఁద,.

భారత. ప్రౌఢిచేత, ప్రదళితములైన బహువైరిపంక్తులయొక్క గళములు గలవాఁడు, మద్రవిభుండు = శల్యుఁడు, సేనానియై = దళవాయియై, తనయొక్క కురుబలౌఘముయొక్కయు, అతనిపైన్ = ధర్మరాజుమీఁద, పోరెను, కడమ సులభము.

వ.

అప్పుడు.

230


తే.

ఆనృపతి సైన్యమును గదనాతిలోలు
భానుజులసద్భుజాశక్తి ప్రాపుగఁ గొని
యాఁగెఁ దచ్ఛల్యతేజంబు నతని నొంచె
నని విరూపాక్షుఁ డనఁ బర్వునతఁడు మెఱసి.

231

భారత. అనృపతి = ధర్మరాజు, కదన = యుద్ధమందు, అతిలోలుభ = అతిప్రియులైన, “లోలుపో లోలుభో లోలః" అని అ. అనుజుల = తమ్ములయొక్క, సద్భుజాశక్తిని బ్రాపుగఁ గొని, తత్ = ఆశల్యునియొక్క, తేజంబు నాఁగెను. అనిన్ = యుద్ధమందు, విరూపాక్షుఁ డనన్ = రుద్రుఁ డనఁగా, పర్వు = ఒప్పెడి, అతఁడు = శల్యుఁడు, అతనిన్ = ధర్మరాజును, నొంచెన్ = నొప్పించెను.

రామ. ఆనృపతి = రాముఁడు, సైన్యమును, కదనాతిలోలుఁడైన, భానుజున్ = సుగ్రీవునిని, లసద్భుజాశక్తినిఁ బ్రాపుగఁ గొని, తత్ = ఆరావణునియొక్క, శల్య = బాణములయొక్క, తేజంబు నాఁగెను, అతనిన్ = సుగ్రీవుని, విరూపాక్షుఁ డనఁ బర్వునతఁడు = విరూపాక్షుఁ డనెడు రాక్షసుఁడు, మెఱసి నొంచెను.

వ.

ఇట్లు నొప్పించిన నిప్పులు గురియుకోపంబునం జూపు దీపింప నాసమర
శూరు నాలోకించి.

232

రెంటికి సరి సులభము.